Hyderabad: క్షణికావేశం..పెను విషాదం! | Wife And Husband Ends Their Life Due To Family Dispute In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!

Apr 10 2025 7:55 AM | Updated on Apr 10 2025 8:23 AM

Wife And husband Ends Life In Hyderabad

కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య.. 

మరుసటి రోజు భవనంపై నుంచి దూకి భర్త..  

అనాథగా మిగిలిన 11 నెలల బాలుడు

హయత్‌నగర్‌: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్‌ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల  క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్‌నగర్‌ ముదిరాజ్‌ కాలనీలో నివసిస్తూ జీహెచ్‌ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు.

 మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్‌ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు.  

ఆవేదనతో భర్త ఆత్మహత్య... 
భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్‌ బుధవారం తెల్లవారుజామన హయత్‌నగర్‌లోని రిలయన్స్‌ డిజిటల్‌ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్‌ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాపం పసికందు... 
భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్‌ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  

Advertisement
 
Advertisement
Advertisement