నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్: సంజయ్‌

Vallabhbhai Patel Jayanti Celebrations At Telangana BJP Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్‌ చిత్రపటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సర్దార్ వల్లభాయ్‌ పటేల్ జన్మదినం సందర్భంగా దేశమంతా ఏక్తా దివస్ నిర్వహిస్తున్నాం. దేశ సమగ్రత కోసం ఐక్యతా దివస్ నిర్వహిస్తున్నాం. దేశాన్ని చిన్నచిన్న సంస్థానాలతో బ్రిటీష్‌ వారు విచ్చిన్నం చేశారు. వీటిని దేశంలో కలిపిన మహనీయులు సర్దార్. భారత దేశంలో విలీనం కాము. అవసరమయితే పాకిస్తాన్‌తో కలుస్తామని అప్పట్లో కొన్ని సంస్థానాలు ప్రకటించాయి.  (పటేల్‌కు ప్రధాని మోదీ నివాళి)

నిజాం మరో అడుగుముందుకేసి ఐక్యరాజ్యసమితిలో కూడా విడిగా ఉంటామని దరఖాస్తు చేసుకున్నాడు. రజాకార్లతో తెలంగాణ ప్రజలు, హిందువులపై, మహిళలపై దాడులు చేసి రక్తపాతం సృష్టించారు. సర్దార్‌ ఆనాడు తెలంగాణ ప్రజలకు స్వంతంత్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించారు. ఏడాది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనమై జాతీయ జెండా ఎగిరింది. తెలంగాణ ప్రజలు దేవుడిలా చూసుకునే సర్దార్‌ను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విస్మరించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మజ్లిస్‌ కనుసైగల్లో పాలన చేస్తూ.. వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు. తెలంగాణ ప్రజలు సర్దార్‌ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. పటేల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విమోచన దినోత్సవంను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహించాలి. ఆగస్టు 15, జనవరి 26 తరహాలోనే సెప్టెంబర్‌ 17ను జాతీయ పండుగలా నిర్వహించాలి. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులకు లెంపలేసుకొని సెప్టెంబర్‌ను జాతీయ పండగలా నిర్వహించాలి' అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. 

ప్రజలంతా ఐక్యంగా ముందుకెళ్లేందుకే ఏక్తా దివస్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పటేల్‌ దేశం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్. పటేల్ లేకపోతే తెలంగాణకు స్వంతంత్రం వచ్చేది కాదు. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని చెబుతున్నా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడిన పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. సెప్టెంబర్ 17ను గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈ రోజైనా కేసీఆర్ సర్దార్ పటేల్‌కు నివాళులర్పించాలి.  ఆయన స్ఫూర్తితో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతా అని చెప్పాలి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సర్దార్ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన స్పూర్తితో అఖండ భారత నిర్మాణం కోసం ముందుకెళ్తాం' అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top