పటేల్‌కు ప్రధాని మోదీ నివాళి

PM Modi pays tribute to Sardar Vallabhbhai Patel - Sakshi

గాంధీనగర్‌ : దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గుజరాత్‌లోని ప్రఖ్యాత ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివాస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని.. ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. మోదీ రాక సందర్భంగా పటేల్‌ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఐక్యతా శిల్పం దగ్గర పర్యాటక కేంద్రాలు 
కెవడియా(గుజరాత్‌): రెండు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నర్మద జిల్లాలోని ప్రఖ్యాత ‘ఐక్యతాశిల్పం(స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ)’కి దగ్గరలో నాలుగు పర్యాటక ప్రదేశాలను ప్రారంభించారు. ఔషధ మొక్కలతో 17 ఎకరాల్లో విస్తరించిన ఆరోగ్య వనాన్ని మొదట ప్రారంభించారు. ఈ ఆరోగ్య వనంలో 380 రకాలకు చెందిన సుమారు ఐదు లక్షల ఔషధ మొక్కలున్నాయి.  ఆ తరువాత, వివిధ రాష్ట్రాల చేనేత, చేతి వృత్తుల ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏక్తామాల్‌ను  ప్రారంభించారు. ప్రధానితో పాటు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఈ రెండంతస్తుల భవనంలోని పలు ప్రదర్శన శాలలను సందర్శించారు.

అనంతరం 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా టెక్నాలజీ ఆధారిత థీమ్‌ పార్క్‌ ప్రపంచంలోనే మొదటిదిగా భావిస్తున్నారు. ‘సరైన పోషణ.. దేశానికి వెలుగు’ నినాద స్ఫూర్తితో చిన్నారులను ఆకర్షించే 47 రకాల ఆకర్షణలు ఇందులో ఉన్నాయి. అనంతరం 375 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘జంగిల్‌ సఫారీ’ని మోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక జంతు ప్రదర్శన శాలలో పులులు, సింహాలు సహా 100  జంతు, పక్షి జాతులు ఉన్నాయి.  మరి కొన్ని కార్యక్రమాల్లో ప్రధాని శనివారం పాల్గొననున్నారు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top