Valentine's Day:Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. మనసున మనసై!

Valentines Day: Story Of Hyderabad Couple Who Got Love Marriage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొండాపూర్‌లో నివసించే హర్షవర్ధన్‌ అచ్చమైన తెలంగాణ అబ్బాయి. చదువుకునే సమయంలో తమిళనాడుకు చెందిన ‘అరు’ అనే యువతి ప్రేమలో పడ్డాడు. పెళ్లి తంతు మొత్తం తమిళ బ్రాహ్మణ సంప్రదాయంలో జరగడం.. ఆమెతో పెళ్లి కోసం అతను చేసుకున్న సర్దుబాట్లలో ఒకటి మాత్రమే. అతని భార్యగా మారాక అరు కూడా ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు తగ్గట్టుగా తన వంతుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ ముందు సంస్కృతీ సంప్రదాయాలు కూడా తలవంచుతాయి అని ఇలాంటి జంటలు నిరూపిస్తున్నాయి.  

ఖండాంతరాలు దాటిన ప్రేమ
‘మేం ఇద్దరం ఆరేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేం పరిచయమయ్యే నాటికి నా వయసు 18 ఆయనకు 25పైనే’ అంటూ గుర్తు చేసుకున్నారు సెలీన్‌ (41). ప్రస్తుతం నగరంలోని మణికొండలో నివసిస్తున్న సెలీన్, ఆమె భర్త కాకుమాను విక్రమ్‌ను ఫ్రాన్స్‌లోనే కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ పెద్దలు, మతాలు వంటి అవాంతరాలు దాటి 2006లో జరిగిన పెళ్లితో సుఖాంతమైంది.

పెళ్లి అనంతరం ఫ్రెంచ్‌ భాషలో ప్రావీణ్యం సాధించిన విక్రమ్‌ ప్రస్తుతం ఓ ఫ్రెంచ్‌ కంపెనీలోనే ఉద్యోగం చేస్తుండగా సెలెన్‌ నగరంలో ఫ్రెంచ్‌ భాషా ఉపాధ్యాయిని. తనకెంతో ఇష్టమైన తెలుగు వంటలు వండటం భార్యకు రాకపోయినా విక్రమ్‌ సర్దుకుపోతుంటే.. భర్తతో కలిసి తిరుపతి వంటి హిందూ దేవుళ్ల ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం సెలెన్‌ అలవాటు చేసుకున్నారు.

ఇక్కడి ఫంక్షన్లకు చక్కగా చీర కట్టుకుని మరీ హాజరయ్యే సెలెన్‌ను చూసినవారెవరైనా ఫ్రెంచ్‌ జాతీయురాలు అంటే నమ్మడం కష్టం. హైదరాబాద్‌ వాతావరణం చాలా నచ్చిందని, తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్నానని చెబుతున్న సెలెన్‌.. తన భర్తకు నచ్చే విధంగా అత్తయ్యా, మావయ్యా అంటూ ఆయన తల్లిదండ్రులను సంబోధిస్తూ సంతోషపెడతారు.  

ఆపం, పుట్టు అతనికి..  ఇడ్లీ.. దోశ ఆమెకి.. 
సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో నగరానికి చెందిన దేవేందర్‌ ఫార్మాసిస్ట్‌గా.. కేరళకు చెందిన శశికళ స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తూ.. ప్రేమించుకున్నారు.  ఆ తర్వాత కేరళ–హైదరాబాద్‌ మధ్య దూరం తరిగిపోయింది. సెటిలయ్యాకే పెళ్లి అనుకున్నారు కాబట్టి పెద్దలు ససేమిరా అని అడ్డం పడినా ఆ అభ్యంతరాలన్నీ దూది పింజలైపోయాయి.

పెళ్లి తర్వాత కొబ్బరినూనెతో వండే కేరళ తరహా వంటలు దేవేందర్‌ ఇష్టపడక తప్పలేదు. అత్తగారి ఊరెళ్లాక అక్కడి వస్త్రధారణ అయిన పంచెకట్టులోనే గుళ్లూ గోపురాలూ తిరగడం అతనికి అలవాటైంది. మరోవైపు కొబ్బరినూనె లేకుండా వండే వంటలు శశికళ తినక తప్పలేదు. అయితే తర్వాత తర్వాత అక్కడి కోకోనట్‌ ఆయిల్‌తో వంటలు ఆరోగ్యకరమని గ్రహించిన దేవేందర్‌ తనకు తన పిల్లల వరకూ అదే ఆయిల్‌ని వాడడం కోసం కేరళ నుంచి 4 కిలోల నూనెను ప్రత్యేకంగా తెప్పిస్తారు.

పుట్టు, ఆపం వంటి కేరళ వంటలతో పాటే దేవేందర్‌కు మలయాళం, ఇక్కడి ఇడ్లీ, పూరిలతో పాటే శశికళకు తెలుగు భాష కూడా వంటబట్టేశాయి. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నా...పరస్పరంప్రేమ ముందు ఇలాంటి సర్దుబాట్లు చిన్నవే అంటోందీ జంట. 

కేరళ అబ్బాయి.. తమిళ అమ్మాయి
అమెజాన్‌ కంపెనీలో పనిచేస్తూనే ప్రేమలో పడిన ప్రియాంక తమిళమ్మాయి, అబ్బాయి శ్రీకాంత్‌ది కేరళ. ఇద్దరూ ప్రేమను పంచుకున్నారు. మరి పూర్తిగా భిన్నమైన సంప్రదాయాలను ఎలా పంచుకుంటున్నారు? అంటే.. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు ఏది బెటరయితే అది ఫాలో అయిపోవడమే అంటూ సింపుల్‌గా చెప్పేస్తారిద్దరూ.

ఉదాహరణకి వీరి పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలి? అనే చర్చ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. కేరళ సంప్రదాయంలో పెళ్లి పట్టుమని 15 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి కాస్త గుర్తుంచుకునేలా ఉండడానికి ఇక్కడి సంప్రదాయాన్నే ఎంచుకున్నారు.

‘ప్యారా’నాపూల్‌ 
చార్మినార్‌: ప్రేమకు గుర్తుగా మూసీ నదిపై పురానాపూల్‌ వంతెనను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘ప్యారా’నాపూల్‌ అనేవారు. తాను ప్రేమించిన భాగమతి దక్షిణ మూసీ ప్రాంతంలో ఉండటంతో.. ఉత్తరం వైపు ఉన్న గోల్కొండ నుంచి ప్రాణాలకు తెగించి నదిని దాటుకుంటూ వచ్చి వెళ్లేవాడు మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా. ఇలా నది నీటిలో ఈదుకుంటూ వెళ్లి రావడం ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా తండ్రి సుల్తాన్‌ ఇబ్రహీం కులీ కుతుబ్‌ షా మూసీపై కొత్తగా వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు.

మూసీ నదిపై వంతెన నిర్మిస్తే తన కుమారుడు క్షేమంగా ఇవతలి నుంచి అవతలికి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. అతను ప్రేమించిన భాగమతిని కలిసి వస్తాడని భావించి 1578లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. దీంతో మూసీ నదిపై భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ వంతెనను నిర్మించాడు. అప్పట్లో ప్యారానాపూల్‌గా ప్రసిద్ధి గాంచిన ఈ వంతెన.. అనంతర కాలంలో పురానాపూల్‌గా వాడుకలోకి వచ్చింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top