జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ , చిత్రంలో ఆది శ్రీనివాస్, స్టీఫెన్ రవీంద్ర తదితరులు
గన్నీ బ్యాగులకు ఇబ్బంది లేదు
ఇప్పటికే 51 ఎల్‌ఎంటీ ధాన్యం కొనుగోలు
జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తాలు, తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తే మిల్లర్లు, కొనుగోలు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఆదివారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఆది శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రూ.8,749 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.
రబీ సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేస్తోందని, మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.


