
నల్గొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా గడపాల్సిన రోజున కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీ బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచాల రమేష్ ,నాగలక్ష్మి(27)దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లాకు వచ్చి కొండమల్లేపల్లిలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అవంతిక(9),మోహన్ సాయి(7) ఉన్నారు. భర్త రమేష్ తాగుడుకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గత కోన్నాళ్లుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు .
ఇదే క్రమంలో అక్టోబర్ 19న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భర్త రమేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగలక్ష్మి తన ఇద్దరి పిల్లల గొంతు నులిమి తాను ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన కొండమల్లేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.