తొలి విడత బరిలో 966 మంది
నల్లగొండ : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 318 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 11న ఎన్నికలు జరుగుతున్నాయి. గతనెల 27న నామినేషన్లు ప్రారంభమై ఈనెల 3న ఉపసంహరణలతో ప్రక్రియ ముగిసింది. 318 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహణకునామినేషన్లు స్వీకరించగా 959 మంది సర్పంచ్ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. 22 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 296 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 966 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 2,870 వార్డులకు నామినేషన్లు స్వీకరించగా 375 వార్డుల్లో ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2,491 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వార్డు స్థానాల బరిలో 5,934 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గుర్తుల కేటాయింపుతో ప్రచార సందడి
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులంతా ప్రచార బాట పట్టడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఈసారి సర్పంచ్ స్థానాలకు చాలా గ్రామాల్లో ఇటు అధికార పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ నెల 9న తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది.
పొత్తులకు చర్చలు..
తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తాము బలపరుస్తున్న అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులకు చర్చలు మొదలు పెట్టాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీ అభ్యర్థులు మద్దతు నిస్తుండగా మరికొన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు సహకరించుకుంటున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కూడా వివిధ గ్రామాల్లో ఆయా పార్టీల ప్రాబల్యాన్ని బట్టి ఒక అవగాహనతో ముందుకెళ్తున్నాయి.
ఫ ఎన్నికలు జరిగే 296 పంచాయతీల్లో తేలిన సర్పంచ్ అభ్యర్థులు
ఫ 2,495 వార్డులకు 5,934 మంది పోటీ
ఫ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
ఫ మొదలైన ప్రచార సందడి


