పొగమంచులో వాహనాలు జాగ్రత్తగా నడపాలి
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నల్లగొండ: చలికాలం నేపథ్యంలో పొగమంచు కురుస్తున్నందున డ్రైవర్లు, వివిధ వాహనదారులు తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఒక ప్రకటనలో సూచించారు. ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయాలని ఆలోచనతో అతివేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా వాహనదారులు లోబీమ్ లైట్లను వాడాలని అవి వాడితేనే వెనుక లైట్లు, మిగతా వాహనదారులకు మీ వాహనం ఎంత దూరంలో ఉందో స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. ముందు ఉన్న వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని కోరారు. నిర్దేశించబడిన లైన్లలో వాహనాన్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా కిటికీ అద్దాలను దించుకుంటే మంచిదని పేర్కొన్నారు. పొగమంచు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కాసేపు వాహనాన్ని ఆపి ముందు, వెనుక ఉన్న అద్దాలను శుభ్రంగా తుడుచుకోవాలని సూచించారు. ఇండికేటర్లను ఉపయోగించి మీరు ఎటువైపు వెళుతున్నారో వెనుక వచ్చే వాహనానికి ముందుగా తెలిసేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని, సడన్ బ్రేక్‌లు వేయవద్దని కోరారు.
వాహనాల తనిఖీ
కేతేపల్లి : మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్‌ప్లాజా వద్ద గురువారం ఎకై ్సజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా రూ.50వేలకు మించి నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ విజయ్, ఎకై ్సజ్ ఎస్‌ఐలు హారిక, చాంద్‌బీ, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
దేవరకొండ : ఈనెల 6న దేవరకొండలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్‌తో కలిసి ఆయన దేవరకొండలోని ప్రభుత్వం ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొటోకాల్‌లో భాగంగా ఆస్పత్రిలో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అననంతరం ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీసి వైద్యులకు పలు సూచనలు చేశారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్ ఉన్నారు.
9న వేరుశనగ విత్తనాలవేలం పాట
డిండి : మండల కేంద్రంలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రంలో 2024–25 సీజన్‌లో పండించిన 73.8 క్వింటాళ్ల వేరుశనగ (విత్తనాల కాయ)కు ఈనెల 9న బహిరంగ వేలం నిర్వహిస్తున్న ఏడీఏ టి.వాసు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఆమన్‌గల్‌ల్లోని కోల్డ్ స్టోరేజీ వద్ద వేరుశనగను నిల్వ ఉంచామని, ఆసక్తి గల వారు వేలం పాటలో పాల్గొనాలని ఏడీఏ పేర్కొన్నారు.
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవ వేడుకలను గురువారం వైభవంగా జరిపించారు. ఉదయం ఆలయ ముఖ మండపంలో విశేష తిరుమంజన స్నపన ఉత్సవం జరిపించిన అర్చకులు.. అనంతరం ప్రబంధ సేవాకాలం, దివ్య ప్రబంధ పారాయణ వేడుకలు చేపట్టారు. రాత్రి నివేదన, తీర్థప్రసాద గోష్టితో ఉత్సవాలకు ముగింపు పలికారు.
పొగమంచులో వాహనాలు జాగ్రత్తగా నడపాలి


