ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి
మిర్యాలగూడ అర్బన్ : ఇతర రాష్ట్రాల నుంచి మిర్యాలగూడకు ధాన్యం లారీలు రాకుండా కట్టడి చేస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖర రాజు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 11 ధాన్యం లారీలను మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌గేట్ వద్ద సీజ్ చేశామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి 6, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 లారీలు ధాన్యం లోడుతో వచ్చినట్లు గుర్తించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గత కొద్దిరోజులుగా రాష్ట్ర సరిహద్దు వద్ద నిఘా పెట్టి 71 ధాన్యం లోడు లారీలను వెనక్కు పంపామని పేర్కొన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మయ్య తదితరులున్నారు.


