డిస్కంల నష్టాలు రూ.36,231 కోట్లు

Tsspdcl  Releases Discoms Annual Report In Assembly - Sakshi

2018–19లో కొత్తగా రూ.8,022.21 కోట్ల నష్టాలు..

దక్షిణ డిస్కం నష్టాలు రూ.19,395.03 కోట్లు..ఉత్తర డిస్కం నష్టాలు రూ.11,869.17 కోట్లు

35% పీఆర్సీతో దాదాపు రెట్టింపైన జీతభత్యాల వ్యయం

హైదరాబాద్‌: డిస్కంలు నష్టాలతో డిష్యుం డిష్యుం అంటున్నాయి. ఏటేటా నష్టాలు ఎట్లెట్లా ఎగబాకుతున్నాయో నివేదికలు తాజాగా వెల్లడించాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు ఏకంగా రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లు నష్టాల్లో ఉండగా, 2018–19లో కొత్తగా మరో రూ.8,022.21 కోట్ల నష్టాలు జతయ్యాయి. దక్షిణ/ ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)లు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక నివేదికలు ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశాయి.

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీ డీసీఎల్‌) నష్టాలు 2017–18 ముగిసేలోగా రూ.19,395.03 కోట్లుండగా, 2018–19 నాటికి 24,362.30 కోట్లకు పెరిగాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) నష్టాలు 2017–18 ముగిసేనాటికి రూ.8,814.23 కోట్లుండగా, 2018–19 నాటికి రూ.11,869.17 కోట్లకు ఎగబాకాయి. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.5,764.95 కోట్ల విద్యుత్‌ సబ్సిడీలను మంజూరు చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల సబ్సిడీలు ఇస్తున్నా, డిస్కంల నష్టాలు శరవేగంగా పెరిగిపోతుండటం గమనార్హం.

ఎన్పీడీసీఎల్‌ ఆదాయంలో 40% సబ్సిడీలే..
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ 2018–19లో 19,119.78 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను సమీకరించగా, అందులో 17,226.28 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 1,893.50 ఎంయూల విద్యుత్‌ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. విద్యుత్‌ కొనుగోళ్లకు రూ.10,461.63 కోట్లు, ట్రాన్స్‌మిషన్, ఎస్‌ఎల్డీసీ చార్జీల కోసం రూ.459.49 కోట్లు కలిపి మొత్తం రూ.10,291.13 కోట్లను ఖర్చుచేసింది. విద్యుత్‌ అమ్మకాలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, దానిపై వడ్డీలు, జరిమానాలు, విద్యుత్‌ చౌర్యం/అక్రమాల రికవరీలు, వినియోగదారుల నుంచి ఇతర చార్జీల వసూళ్ల ద్వారా ఎన్పీడీసీఎల్‌ రూ.6,027.55 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,254.15 కోట్ల విద్యుత్‌ సబ్సిడీలు, రూ.113.30 కోట్ల అదనపు సబ్సిడీలను మంజూరు చేసింది. దీంతో 2018–19లో ఎన్పీడీసీఎల్‌ రూ.10,395 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్పీడీసీఎల్‌ మొత్తం ఆదాయంలో ప్రభుత్వ సబ్సిడీల వాటే 41 శాతానికిపైగా ఉండటం గమనార్హం.

అధికధరకు కొని తక్కువధరకు విక్రయం
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 2018–19లో 44,997.11 ఎంయూల విద్యుత్‌ను కొనుగోలు చేయగా, 40,342.50 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 4,654.61 ఎంయూల విద్యుత్‌ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. ఈ మేరకు విద్యుత్‌ కొనుగోళ్లు, ట్రాన్స్‌మిషన్, ఇతర చార్జీలు కలిపి సంస్థ రూ.24,837.33 కోట్లు వ్యయం చేసింది. ఉద్యోగుల జీతభత్యాల కోసం మరో రూ.2,134.85 కోట్లు వెచ్చించింది. వినియోగదారులకు విద్యుత్‌ అమ్మకాల ద్వారా మొత్తం రూ.23,899.76 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో రూ.1,397.50 కోట్ల సబ్సిడీలున్నాయి. 

జీతభత్యాల వ్యయం తడిసిమోపెడు
విద్యుత్‌ ఉద్యోగులకు 35 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, పెన్షనర్లకు అదనంగా మరో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను 2018 ఏప్రిల్‌ నుంచి అమలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కన్నా అధికంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగుల జీతాలు పీఆర్సీ అమలుతో మరింత భారీగా పెరిగిపోయాయి. 2017–18లో రూ.2,541.27 కోట్లున్న రెండు డిస్కంల ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 2018–19లో రూ.4,059.69 కోట్లకు పెరిగిపోయింది.

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జీతభత్యాల వ్యయం రూ.1,876.93 కోట్ల నుంచి రూ.2,134.85 కోట్లకు, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ జీతభత్యాల వ్యయం రూ.664.34 కోట్ల నుంచి రూ.1,624.84 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగులకు 35 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీకి అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా పెన్షనర్లకు అదనంగా 7.5 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింపజేశారని కాగ్‌ అభ్యంతరం తెలిపింది. ట్రాన్స్‌కో సంస్థ జారీ చేసే ఉత్తర్వులను డిస్కంలు కూడా అమలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, పెన్షనర్ల విషయంలో సైతం ఇదే చేశామని, ఇందులో ఉల్లంఘనలేమి లేవని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాజమాన్యం కాగ్‌కు వివరణ ఇచ్చింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top