కలెక్టర్‌కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన

TS High Court Suggestion To Nalgonda Collector - Sakshi

సామాజిక సేవ చేస్తే శిక్ష నిలిపివేస్తాం

కోర్టుధిక్కరణ కేసులో కలెక్టర్‌కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన

తదుపరి విచారణలోగా ఏ సేవ చేస్తారో చెప్పాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుధిక్కరణ కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ ఓ కలెక్టర్‌ దాఖలు చేసిన అప్పీల్‌లో హైకోర్టు వినూత్న ప్రతిపాదన చేసింది. స్వచ్ఛందంగా సామాజిక సేవ చేసేందుకు ముందుకు వస్తే కోర్టుధిక్కరణ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేసే విషయాన్ని పరిశీలిస్తామని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, పౌరసరఫరాల విభాగం ఉద్యోగిని పి.సంధ్యారాణిలకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణలోగా ఎటువంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలపాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

సివిల్‌ సప్లయిస్‌ అధికారులు అకారణంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ వరంగల్‌ పట్టణానికి చెందిన పరమేశ్వర బిన్నీ రైస్‌ మిల్‌ యజమాని జి.చంద్రశేఖర్‌ 2016లో హైకోర్టును ఆశ్రయిం చారు. తనపై క్రిమినల్‌ కేసును సాకుగా చూపి ధాన్యం సరఫరాను నిలిపివేశారని, ఇదే తరహా కేసులు ఉన్నవారికీ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి... పరమేశ్వర మిల్స్‌కు కూడా ధ్యానం సరఫరా చేసి బియ్యాన్ని కొనుగోలు చేయాలని అప్పటి వరంగల్‌ జాయింట్‌ కలెక్టర్‌ పాటిల్, డీఎస్‌వో సంధ్యారాణిలను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోగా తనను మరింత ఇబ్బందులకు గురిచేశారంటూ 2016లోనే మిల్లు యజమాని చంద్రశేఖర్‌ కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు విచారించారు. జేసీ పాటిల్, సంధ్యారాణిలు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఇద్దరికీ రూ.2 వేల చొప్పున జరిమానా లేదా ఆరు వారాలపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ పాటిల్‌ 2017లో అప్పీల్‌ దాఖలు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top