డిసెంబర్‌ లోపు ట్రిపుల్‌ ఆర్‌ పనులు షురూ | Triple R works will start before December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ లోపు ట్రిపుల్‌ ఆర్‌ పనులు షురూ

Published Thu, Jun 20 2024 4:36 AM | Last Updated on Thu, Jun 20 2024 4:36 AM

Triple R works will start before December

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి 

అక్టోబర్‌లో శంకుస్థాపన చేసే యోచన 

వీలైతే ప్రధాని చేతుల మీదుగా కార్యక్రమం 

ఢిల్లీలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్‌ 

రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) పనులను డిసెంబర్‌లోపు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్‌లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ట్రిపుల్‌ ఆర్‌ పనులు ఇప్పటివరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్టు చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.  

ట్రిపుల్‌ ఆర్‌ ఆధారంగా స్పోర్ట్స్, హార్డ్‌వేర్‌ జోన్లు 
‘ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ హబ్‌గా మార్చే స్థాయి ట్రిపుల్‌ ఆర్‌కు ఉంది. దీనిని ఆధారంగా చేసుకుని స్పోర్ట్స్‌ జోన్, హార్డ్‌వేర్‌ జోన్‌లాంటి వాటిని ఏర్పాటు చేయనున్నాం. దీనితోపాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌–విజయవాడ హైవే ఆరు వరుసల విస్తరణ పనులను కూడా డిసెంబర్‌ నాటికి కొలిక్కి తెస్తాం. రూ.375 కోట్ల విలువైన పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. 17 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నాం.

రూ.5,600 కోట్లతో గ్రీన్‌ హైవేగా బెంగుళూరు రహదారిని, ఎలివేటెడ్‌ కారిడార్లతో నాగ్‌పూర్‌ జాతీయ రహదారిని మెరుగుపరుస్తాం. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్‌ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే, మా ప్రభుత్వం అకౌంటబిలిటీ(జవాబుదారీతనం) కోసం పనిచేస్తుంది..’అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. 
 
3 నెలల్లో అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రారంభం 
‘ఎనిమిదేళ్ల క్రితం పనులు మొదలై నిలిచిపోయిన ఉప్పల్‌ వంతెన పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం. అంబర్‌పేట వంతెనను 3 నెలల్లో ప్రారంభిస్తాం. అల్వాల్‌ మార్గంలో 14 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. ఢిల్లీలో ఏపీ భవన్‌ స్థలంలో మన దామాషా ప్రకారం దక్కే భూమిలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తాం. దీనికి సంబంధించి డిజైన్లు పూర్తయ్యాయి. రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. 

రోల్‌ మోడల్‌గా తెలంగాణ రోడ్లు 
తెలంగాణ రోడ్లు రోల్‌మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రహదారుల్లో వేటిని జాతీయ రహదారులుగా మార్చాలో తేల్చి కేంద్రానికి ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రస్తుతం 16 రోడ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. వాటికి అనుమతులు సాధిస్తాం. 

అవసరమైతే ముఖ్యమంత్రితో పాటు ప్రధానిని కలుస్తాం. రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం పార్లమెంటులో విపక్ష కూటమి బలంగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తాం. హైదరాబాద్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే, దాని పక్కనే బుల్లెట్‌ రైలు మార్గం సాధించేందుకు కూడా ఒత్తిడి చేస్తాం. కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. 
 
ఉస్మానియాకు కొత్త భవనంపై అఖిలపక్ష సమావేశం 
నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి అదే స్థలంలో కొత్త భవనాన్ని, అదే నమూనాలో నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వరలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. పాటిగడ్డలో హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. దేశంలోనే గొప్ప హైకోర్డు భవనంగా తెలంగాణ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తాం. దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో భవనం సిద్ధమవుతుంది..’అని మంత్రి వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement