వాట్సాప్, ఈ–మెయిల్‌లోనే ట్రాఫిక్‌ చలాన్లు! | Traffic challans on WhatsApp and email | Sakshi
Sakshi News home page

వాట్సాప్, ఈ–మెయిల్‌లోనే ట్రాఫిక్‌ చలాన్లు!

Jun 2 2026 5:50 AM | Updated on Jun 2 2026 5:52 AM

Traffic challans on WhatsApp and email

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు ఇకపై ఈ–చలానా వారి వాట్సాప్‌కు జారీ కానుంది. వాట్సాప్‌ సౌలభ్యం లేకపోతే వాహనదారుడి మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్‌ రూపంలోనూ అందనుంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధన ప్రకారం రాష్ట్రంలోని వాహనదారులంతా తమ ప్రస్తుత మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీని కేంద్ర ప్రభుత్వ అధికారిక ‘వాహన్‌’పోర్టల్‌లో కచి్చతంగా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 2న అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ నుంచి నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా గడువు ముగిసే నాటికి ‘వాహన్‌’పోర్టల్‌లో మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోకపోయినా లేదా అసలు నమోదే చేసుకోకపోయినా చలానాలు వారికి అందినట్లుగానే భావిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పాత మొబైల్‌ నంబర్‌ ఇప్పటికే వాహన్‌ పోర్టల్‌లో నిక్షిప్తమై ఉండి, మారిన కొత్త మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేసుకోకుంటే పాత నంబర్‌కు చలానాలు పంపి అవి వాహనదారుడికి చేరినట్లుగానే భావించాల్సి ఉంటుందని వెల్లడించింది.  

ఆన్‌లైన్‌లో ‘రెడ్రసల్‌’అప్పీల్‌! 
ఒకవేళ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించకపోయినా చలాన్లు అందాయని వాహనదారులు భావిస్తే వాటిపై అభ్యంతరం తెలుపుతూ ఆన్‌లైన్‌ ద్వారా సవాల్‌ చేయొచ్చు. ఇందుకోసం నిర్దేశిత ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఆధారాలతో (డాక్యుమెంట్లు లేదా ఫొటోలు) అప్పీల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలవారీగా పోలీస్, రవాణా శాఖ అధికారులను ప్రభుత్వం నియమించింది. తమకు అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని నిర్ధారణకు వస్తే ఆయా చలానాలను రద్దు చేసి అందుకుగల కారణాలను లిఖితపూర్వకంగా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ ఆర్డర్‌ కాపీ నేరుగా వాహనదారుల మొబైల్‌ లేదా ఈ–మెయిల్‌కు అందుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న లోకల్‌ ఆన్‌లైన్‌ చలానా సిస్టమ్‌కు ప్రభుత్వం ఆరు నెలల గడువు విధించింది. రాబోయే 6 నెలల్లోగా తెలంగాణ పోలీస్, రవాణా శాఖలు తమ చలాన్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సారథి–వాహన్‌’ఈ–చలానా సిస్టమ్‌కు పూర్తిగా బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా చలాన్ల ప్రక్రియ ఏకతాటిపైకి రానుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement