హైదరాబాద్: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో పూర్తి నిర్లక్ష్యం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌దే అని టిప్పర్ యజమాని లక్ష్మణ్‌నాయక్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్‌లో డ్రైవర్ ఆకాశ్ కాంబ్లేతోపాటు ఓనర్ లక్ష్మణ్‌నాయక్ కూడా ప్రయాణించారు. దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆయన్ను వికారాబాద్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం హైదర్షాకోట్లోని మెడ్‌లైఫ్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ వేగంగా వచ్చి గుంతను తప్పించబోయి తమపైకి వచ్చాడన్నారు. ఈ సమయంలో డ్రైవర్ ఆకాశ్‌కాంబ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనపైకి వేగంగా వస్తున్నాడంటూ తనను నిద్రలోంచి లేపాడని చెప్పారు. క్షణాల్లోనే ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి తమ టిప్పర్‌ను ఢీకొట్టిందన్నారు. ఆకాశ్‌కాంబ్లే మద్యం తాగి వాహనం నడిపాడని, తామే గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టామని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.


