ఒక్కోపులి విలువ రూ.250 కోట్లు | Sakshi
Sakshi News home page

అదిగో పులి!

Published Wed, Oct 21 2020 8:17 AM

Tiger Is Crucial For Ecological Life Cycle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 30,40 ఏళ్ల తర్వాత మళ్లీ పులిజాడలు కనిపిస్తున్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌), కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌ ).. ఈ అభయారణ్యాల్లోనే కాక కొత్తగా ఏటూరునాగారం, పెద్దపల్లి వంటిచోట్ల పులుల పాదముద్రలు లభించడం అడవులు, పర్యావరణపరంగా కీలక పరిణామమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. 30 ఏళ్ల కిందటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల నుంచి పులులు కనిపించకుండాపోగా ఇటీవ ల ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వీటి కదలికలు రికార్డయ్యాయి. రామగుండం ఎన్టీపీసీ పవర్‌ ప్రాజెక్ట్‌ సమీపంలో మరో పులి కనిపించింది. ఏటూరునాగారంలో కనిపించిన పులే జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లాకు చేరుకుని తాడిచెర్ల, మహాముత్తారం ప్రాంతాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోనూ సంచరించినట్టు అటవీ అధికారు లు నిర్ధారించారు. కిన్నెరసాని, పాకాల ఇతర అటవీ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు పులులు స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.

అడవికి పులే ఆధారం: పులుల భద్రత, పరి రక్షణతోనే మనుషులు, ఇతర జీవజాలం, పర్యావరణ భవిష్యత్‌ ఆధారపడి ఉన్నాయని పర్యావరణ నిపుణులు, ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పులిపైనే ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 54 పులుల అభయారణ్యాలు ఉండగా, వాటిలో 2 వేల చ.కి.మీ పైబడి అటవీ వైశాల్యమున్న నాలుగైదు అభయారణ్యాల్లో 3 ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఏపీలోని నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) 3,728 చ.కి.మీలలో విస్తరించగా, 60 పులులున్నట్టు ఇటీవలి వెల్లడైంది. తెలంగాణలోని ఏటీఆర్‌ 2,611 చ.కి. మీలుగా విస్తరించి ఉండగా 20 పులులు, 2,016 చ.కి.మీ విస్తీర్ణం గల కేటీఆర్‌ పరిధిలో 12 వరకు పులులున్నట్టు అంచనా. 

వంద పులుల స్థిరనివాసానికి..
రాష్ట్రంలోని అడవుల్లో వంద వరకు పులుల స్థిరనివాసానికి అనుకూల పరిస్థితులున్నా యి. ఒక పులి స్వేచ్ఛగా జీవించేందుకు 50 చ. కి.మీ అడవి అవసరం. ఏటీఆర్, కేటీఆర్‌ లో కలిపి 5 వేల చ.కి.మీ ఉండటంతో వంద దాకా పులుల జీవనానికి అనుకూల పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు అభయారణ్యాల్లో 26 పులులున్నట్టు 2018 పులుల గణనలో వెల్లడైంది. ఇవికాక మరో 6 పులుల వరకు పెరిగి ఉంటాయనేది అంచనా. ప్రస్తుతం ఏపీలో 60, తెలంగాణలో 32 దాకా పులులున్నట్టు భావిస్తున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం తో అక్కడ చోటుసరిపోక తెలంగాణకు పులు లు వలస వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యంలో సానుకూల పరిస్థితి లేకపోవడంతో ఇక్కడకు తరలివస్తున్నాయి. ఇక్కడ మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగి నసంఖ్యలో జంతువులు, నీటివనరులుండటం సానుకూలంగా మారుతున్నాయి.

ఒక్కోపులి విలువ రూ.250 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్‌ రిజర్వులు నదుల ఒడ్డునే ఉండడంతో పాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. తెలుగు రాష్ట్రాల భవిష్యత్‌ పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలంటే అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్‌ సర్వీసెస్‌) డబ్బు విలువపరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ.250 కోట్లని అంచనా. 

పర్యావరణ జీవచక్రంలో పులే కీలకం
జీవనోపాధికి దేశంలోని 30 కోట్ల మందికిపైగా అడవులపైనే ప్రత్యక్షంగా ఆధారపడుతున్నారు. స్చచ్ఛమైన గాలి, పర్యావరణం, జీవ వైవిధ్యం, ఔషధ మూలికల కోసం మిగతా అందరూ పరోక్షంగా ఆధారపడుతున్నారు. అడవుల మనుగడ, పర్యావరణ జీవచక్రం, జీవవైవిధ్యం వంటివి పులితోనే ముడిపడి ఉంటాయి. పులుల ఆవాసాల పరిరక్షణతో మిగతా జంతుజాతులు, అటవీ ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి. పులుల సంఖ్య తగ్గి ఇతర జంతువుల సంతతి పెరిగితే జంతుజాలం మధ్య అసమతుల్యత పెరిగి జీవ వైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటాయి.    
– జి.సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్, ఫారెస్ట్‌ 2.0 రీజినల్‌ డైరెక్టర్‌    

పులి.. అడవికి ఛత్రపతి
అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, మనుషుల మనుగడ వంటివి ప్రత్యక్షంగా, పరోక్షంగా పులులపై ఆధారపడి ఉన్నాయి. అడవిలోని పులిని జాగ్రత్తగా సంరక్షించుకుంటే, దాని ద్వారా ఇతర జంతువులకూ రక్షణ లభిస్తుంది. టైగర్‌ను ఫ్లాగ్‌షిప్‌ ఫర్‌ ఎకోసిస్టమ్‌గా, అంబ్రెల్లా స్పీషీస్‌గా మేం పరిగణిస్తాం. గొడుగు ఎలాగైతే తన కింద ఉన్న వాటిని తడవకుండా చూస్తుందో అడవికి పులీ అంతే. 
 – ఫరీదా తంపాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ స్టేట్‌ డైరెక్టర్‌ 

Advertisement
Advertisement