ఆర్టీసీలో విచిత్ర పరిస్థితి
కొత్త వేతన సవరణతో పెరిగిన జీతాలు
రోజుకు రూ.2 కోట్ల ఆదాయం పెంచాలంటూ డిపోలకు మౌఖిక ఆదేశాలు
వంద శాతం ఓఆర్ దాటినా మరింత పెంచాలంటూ టార్గెట్లు
అంటే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవాలని చెబుతున్న తీరు
లక్ష్యం సాధించలేదంటూ 100 శాతం ఓఆర్ దాటిన డిపోలకు కూడా మెమోలు జారీ
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ చేయాలన్నది సాధారణంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌గా ఉంటుంది. కానీ, ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో వేతన సవరణ కంటే కార్మీకుల నుంచి ప్రధానంగా వినిపించిన డిమాండ్ ‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి’అన్నదే. ప్రభుత్వంలో విలీనం అయితే పనిఒత్తిడి నుంచి కొంత ఊరట లభిస్తుందన్న ఆశతో అదే ప్రధాన డిమాండ్‌గా సమ్మెకు దిగారు. అయితే సమ్మె ముగిసిన తర్వాత వెంటనే మరింత పనిఒత్తిడి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రోజువారీ టికెట్ ఆదాయాన్ని కనీసం రూ.2 కోట్ల మేర పెంచాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపోలకు మౌఖిక ఆదేశాలందాయి. ఇటీవలి సమ్మె నేపథ్యంలో, ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న 2021 వేతన సవరణ చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీని వల్ల సంస్థపై రూ.35 కోట్ల వరకు నెలవారీ భారం నమోదు కానుంది. రోజువారీ ఆదాయం–రోజువారీ ఖర్చులను పరిశీలిస్తే రోజుకు రూ.2 కోట్ల లోటు నమోదవుతోందని అధికారులు లెక్కలేశారు. నెలకు ఆర్టీసీకి వస్తున్న ఆదాయం రూ.630 కోట్లు కాగా, ఖర్చు రూ.655 కోట్లుగా ఉందని ఇటీవల డిపోలకు సమాచారం అందించారు. అంటే ఇప్పటికే నెలకు రూ.25 కోట్ల లోటు ఉండగా, వేతన సవరణతో కొత్తగా రూ.35 కోట్ల భారం పెరుగుతోంది. వెరసి రూ.60 కోట్ల లోటు పెరగనుంది. దీంతో రోజువారీ ఆదాయాన్ని రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లకు పెంచాలంటూ కిందిస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో మళ్లీ కార్మీకులపై ఒత్తిడి పెరగబోతోంది.
సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించండి !
‘2018లో కొండగట్టు వద్ద 65 మంది ప్రాణాలు బలిగొన్న బస్సు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదంతోపాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం కూడా ఓ కారణమని విచారణలో తేలింది. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్న సిఫారసులు జారీ అయ్యాయి’
⇒ ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో వంద నమోదవుతోంది. చాలా రూట్లలో అది 110 శాతాన్ని కూడా మించుతోంది. దీంతో తదుపరి నెలల్లో ఆక్యుపెన్సీ రేషియో అంతకుమించి ఉండాలని స్వయంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోలకు లక్ష్యం నిర్ధారిస్తున్నారు. అంటే, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోమని నేరుగానే చెబుతున్నారన్నమాట. వంద శాతాన్ని మించి ఓఆర్ నమోదైనా... అది టార్గెట్ కంటే తక్కువ ఉంటే డిపో మేనేజర్లను ప్రశ్నిస్తున్నారు. కొందరు మెమోలు జారీ అవుతున్నాయని తెలిసింది. దీంతో డిపో మేనేజర్లు కార్మీకులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామం.
⇒ 2019లో రికార్డుస్థాయిలో 52 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు, విధుల్లోకి రాని ఉద్యోగులు, కార్మీకులను తొలగిస్తామని, వారి స్థానంలో ప్రైవేట్ సిబ్బందిని తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించటంతో అప్పట్లో సమ్మె ఆగిపోయింది. ఆ తర్వాత సమ్మె అంటేనే కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అలాంటిది పని ఒత్తిడిని తట్టుకోలేక మళ్లీ తెగువతో సమ్మెకు దిగారు.
ప్రశ్నించలేక.. కార్మీకులపై ఒత్తిడి పెంచుతున్న డీఎంలు...
ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు డిపో మేనేజర్లు అంతా పదోన్నతుల ద్వారా వచ్చిన వారే, డైరెక్ట్ రిక్రూటీస్ లేరు. పదోన్నతుల ద్వారా డీఎంలు అయిన వారు డిపో ఇబ్బందులు, ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల అమలు సమస్యల మీద ఉన్నతాధికారులను ప్రశ్నించలేకపోతున్నారు. దీంతో ఆదేశాలను అమలు చేయాల్సి రావటంతో నేరుగా కార్మికులపై ఒత్తిడి పెంచాల్సి వస్తోంది. తాజాగా రూ.2 కోట్ల అదనపు ఆదాయం విషయంలో కార్మీకులకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తుంటే, ‘సమ్మె చేసినా మాపై ఒత్తిడి తగ్గించరా’అంటూ కార్మీకులు డిపో మేనేజర్లను ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు ఉన్నతాధికారులకు చెప్పలేక, ఇటు కార్మీకులతో పని చేయించలేక డిపో మేనేజర్లు సతమతమవుతున్నారు.


