TS: ‘ఫిర్యాదు’కు దిక్కులేదు

Telangana Police Complaint Authority No Response To People Complaints In TS - Sakshi

కాగితాలకే పరిమితమైన తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ 

ఉత్తర్వులిచ్చి మూడునెలలైనా కార్యాలయం ఏర్పాటు కాని వైనం  

ఫిర్యాదు చేసేందుకు వచ్చి వెనుదిరుగుతున్న బాధితులు 

వెబ్‌సైట్లను సైతం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఇతర రాష్ట్రాలు  

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖ మరింత పారదర్శకతతో పనిచేసే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ (తెలంగాణ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ) కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. బాధితులను వేధించడం, గాయపరచడం, పోలీసులపై ఆరోపణలు ఇతరత్రా తీవ్రమైన ఘటనలకు పాల్పడే వారిపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపేందుకుగాను ఈ ఏడాది జూలై 7న తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఉత్తర్వులిచ్చి మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పోలీసులపై ఫిర్యాదు ఇచ్చేందుకు ఎవరిని ఎక్కడ సంప్రదించాలో తెలియని అయోమయపరిస్థితి నెలకొంది. కొంతమంది రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ్నుంచి బాధితులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.  

ఇదీ నేపథ్యం... 
ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై విచారణ కోసం దేశవ్యాప్తంగా పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని 1996లో ప్రకాశ్‌సింగ్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ మేరకు రాష్ట్రాల వారీగా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని 2006లో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అప్పట్నుంచి అన్ని రాష్ట్రాలు క్రమక్రమంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ వచ్చాయి. ఇందులోభాగంగా 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన అథారిటీ యాక్ట్‌ను పరిగణనలోకి తీసుకుని 2021 జూలై 7న తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 

వెబ్‌సైట్లను సైతం అందుబాటులోకి తెచ్చిన ఇతర రాష్ట్రాలు 
తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మహరాష్ట్ర, అస్సోం, ఢిల్లీ, కర్ణాటక, హరియాణ తదితర రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసి వాటి కార్యాలయాలతో పాటుగా వెబ్‌సైట్లను కూడా ఆయా రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి. ఆ వెబ్‌సైట్లలో కేసుల వివరాలు, తాజా పరిస్థితి, విచారణ తేదీలు ఇలా అన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం ప్రాధికార సంస్థ ఏర్పాటుకు జీవో ఇచి్చన హోంశాఖ తదుపరి ఏర్పాట్లపై చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top