కొత్త సచివాలయం.. కిటికీలే కీలకం

Telangana New Secretariat Building Plans May Change Due To Coronavirus - Sakshi

సెంట్రలైజ్డ్‌ ఏసీ ఊసే లేదు

సమావేశమందిరాలకూ ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌

కోవిడ్‌ ప్రభావం నేపథ్యంలో మార్పులు, చేర్పులు

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రలైజ్డ్‌ ఏసీ.. అద్దాలు.. అధునాతన నిర్మాణశైలీ.. ఇవీ భవంతుల నిర్మాణాల్లో సర్వసాధారణంగా కనిపించే డిజైన్లు. కానీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్‌ ప్రభావంతో ఇప్పుడు ఆలోచన పూర్తిగా మారుతోంది. భవనాల డిజైన్లూ మారుతున్నాయి. కొత్తగా నిర్మించబోతున్న తెలంగాణ సచివాలయ భవనం కూడా దీనికి అతీతంకాదు. తెలంగాణ రాష్ట్ర ఘనతను సమున్నతంగా చాటే రీతిలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్‌ తీరంలో సాక్షాత్కరించబోతున్న కొత్త సచివాలయ భవనం సంప్రదాయపద్ధతిలో, వీలైనన్ని ఎక్కువ కిటికీలతో రూపుదిద్దుకోనున్నది. అత్యున్నత స్థాయి సమావేశమందిరాలకు కూడా కిటికీలను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని సెంట్రలైజ్డ్‌ ఏసీ వసతితో నిర్మించాలని తొలుత భావించారు. అయితే, ఈ తరహా డిజైన్లపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు నుంచీ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. భవనం అంతా ఏసీపై ఆధారపడేటట్లు ఉండే డిజైన్‌పట్ల సీఎం వ్యతిరేకంగానే ఉన్నారు. ముఖ్యమైన సమావేశ మందిరాలు, కొన్ని గదులు ఏసీతో ఉండేలా నిర్మించాలనుకున్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్కిటెక్ట్‌ సంస్థ, ఇంజనీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చ జరిగింది. ఎంత ఆధునికంగా నిర్మిస్తున్నప్పటికీ, దీనికి సెంట్రలైజ్డ్‌ ఏసీ వద్దని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించినట్టు సమాచారం. ఆ సమావేశం జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి.

మన దేశంలో కోవిడ్‌ మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి సెంట్రలైజ్డ్‌ ఏసీ భవనాలు తక్కువగా ఉండటం, ఏసీల్లో ఎక్కువ సమయం గడిపేవారి సంఖ్య తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెండు పర్యాయాలు సీఎం అధికారులతో భేటీ అయి డిజైన్లపై ప్రత్యేక సూచనలు చేశారు. తాజాగా భవనంలో ఎక్కడా కిటికీలు లేకుండా పూర్తిగా ఏసీపై ఆధారపడే గది ఒక్కటి కూడా ఉండొద్దని నిర్ణయించారు. అన్ని సమావేశ మందిరాలకూ సహజరీతిలో గాలి, వెలుతురు ప్రసరించేలా విశాలమైన కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏసీ వసతితోపాటు ప్రతి గదిలో సీలింగ్‌ ఫ్యాన్లు కూడా ఉండేలా చూస్తున్నారు. 

ఇక్కడి చెట్లు సంజీవయ్య పార్కుకు..
సచివాలయ ప్రాంగణంలో చిన్నా, పెద్దా కలిపి 630 చెట్లున్నాయి. వీటిల్లో పెద్దవి దాదాపు వంద వరకు ఉంటాయి. ప్రధాన భవనాలు నిర్మించే ప్రాంతంలో 30 వరకు ఉన్నాయి. వీటిని కచ్చితంగా తొలగించాల్సి ఉంటుంది. కొత్త సచివాలయ ప్రాంగణంలోనే మరో చోటకు వాటిని ట్రాన్స్‌లొకేట్‌ చేయాలని భావిస్తున్నారు. అనుకూల పరిస్థితులు లేని పక్షంలో వాటిని సంజీవయ్య పార్కుకు తరలించాలని నిర్ణయించారు. కానీ, కొన్ని మాత్రమే ఆ పద్ధతిలో జీవించి ఉంటాయి. కొన్ని చనిపోతాయి. త్వరలో నిపుణులతో ఆ విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top