జల విద్యుదుత్పత్తి ఈ ఏడాదీ 100 శాతం

Telangana Govt Planning Power Generation 100pc Srisailam Dam Telangana Govt Planning Power Generation 100PC Srisailam Dam - Sakshi

జల విద్యుదుత్పత్తిపై  రాష్ట్ర సర్కారు యోచన

వరద ప్రవాహం వచ్చిన వెంటనే శ్రీశైలంలో ఉత్పత్తి ప్రారంభం 

సంక్షోభ నివారణకు మరో మార్గం లేదని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: జల విద్యుదుత్పత్తి విషయంలో తగ్గేదే లేదన్న ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జలాశయాల్లో నిల్వలు, సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా గతేడాది తరహాలో ఈ ఏడాది కూడా 100 శాతం సామర్థ్యంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నట్టు తెలంగాణ జెన్‌కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు వెల్లడించాయి. రానున్న వర్షా కాలంలో ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభమైన వెంటనే శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభిస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.  

ఏపీ అలా.. రాష్ట్రం ఇలా 
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరుపుతోందని ఏపీ ఆరోపిస్తుండగా..విద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మాణం జరిగిందంటూ రాష్ట్రం వాదిస్తోంది. రాష్ట్ర అవసరాల మేరకు జలవిద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, జల విద్యుత్‌ కేంద్రాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది.  

దుర్వినియోగం కాదు.. 
2500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన తెలంగాణలోని జలవిద్యుత్‌ కేంద్రాల్లో 100 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశిస్తూ గతేడాది జూన్‌ 28న తెలంగాణ ఇంధన శాఖ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడంతో నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయం వేసవికి ముందే ఖాళీ అయింది.

కృష్ణా నదికి గతేడాది 1,100 టీఎంసీలు రాగా, ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 5 టీఎంసీలకు మించి నిల్వలు లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరిపి శ్రీశైలం జలాశయాన్ని దుర్వినియోగం (మిస్‌ మ్యానేజ్‌మెంట్‌) చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు భారీగా పెరిగిపోయాయని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేందుకు జల విద్యుదుత్పత్తి తప్ప మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది దుర్వినియోగం కాదని, సంక్షోభ నివారణ కోసం జల విద్యుదుత్పత్తి చేస్తున్నామని పేర్కొంటోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top