Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్‌! 

Telangana Govt Planning To New Roster May Replace For Jobs - Sakshi

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో ఇదే అత్యంత కీలకం 

కొత్త జోనల్‌ విధానంతో ఒకటి నుంచి రోస్టర్‌ పాయింట్లు ప్రారంభం 

నూతన రోస్టర్‌ అమలుపై ప్రభుత్వం సమాలోచనలు 

పోస్టుల విభజన తర్వాతే నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్‌ పట్టిక ఒకటో నంబర్‌ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్‌ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్‌ను ఒకటో నంబర్‌ నుంచి అమలు చేసింది.

ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్‌ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్‌ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్‌ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్‌ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

నూతన జోనల్‌ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్‌ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

మారిన కేడర్‌... కొత్త రోస్టర్‌ 
రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్‌ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్‌ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్‌ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్‌ కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్‌ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్‌ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. 
 
ఉద్యోగ ఖాళీలు 65వేలు? 
కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. 
 
ఏమిటీ రోస్టర్‌? 
ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్‌. రోస్టర్‌ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్‌ మహిళతో మొదలవుతుంది. జనరల్‌ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్‌ మహిళ, డిజేబుల్‌ జనరల్‌ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్‌ పాయింట్లలో ఖరారు చేశారు.

ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్‌ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్‌ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్‌ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top