
ఓ యువతికి గ్రూప్–2 నియామక పత్రం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి పొన్నం, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు
‘కొలువుల పండుగ’లో సీఎం రేవంత్
కలుషితాహారం, రోడ్డు ప్రమాదాలపై విపక్షాలది రాద్ధాంతం.. ప్రజల చావు కోరుకుని రాజకీయాలు చేస్తున్నాయి
యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
గ్రూప్–2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల అందజేత
ప్రతిబిడ్డనూ ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు పైశాచికానందంలో మునిగితేలుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కలుషి తాహారం, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనలు జరిగిన వెంటనే అక్కడ వాలిపోయి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఘటనలు జరగకుండా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. శనివారం శిల్పకలావేదికలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అథితిగా హాజరై గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం కొత్తగా ఉద్యోగాలు పొందినవారిని ఉద్దేశించి మాట్లాడారు.
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలి
అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం విమర్శించారు. ‘వాళ్ల (గత పాలకులు) కుటుంబంలో ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు (పదవులు) ఇచ్చారు. కరీంనగర్ ఎంపీగా ఓడిన వ్యక్తికి రెండు నెలల్లో, నిజామాబాద్ ఎంపీగా ఒడిన బిడ్డకు రోజుల వ్యవధిలోనే కొలువులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న వాళ్లను నిలువునా ముంచారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేశాం.
ఏడాదిలోపే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్స్ ఉద్యోగాలను కూడా అవరోహణ క్రమంలో భర్తీ చేస్తున్నాం. మొన్న గ్రూప్–1, ఈరోజు గ్రూప్–2, త్వరలో గ్రూప్–3.. ఇలా భర్తీ చేస్తున్నాం. ఉద్యోగాలు సాధించిన వారిని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో చీకటి రోజులు పోయి వెలుగు నిండాలి. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు.
అలాంటి వ్యవస్థ మాకు లేదు.. మీరే మా వ్యవస్థ. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్లు. మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ–2047 విజన్‌కు అనుగుణంగా పనిచేయాలి. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపాలి. రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ నెలవారీ జీతం నుంచి 10 నుంచి 15 శాతం కోతపెట్టి ఒకటోతేదీన వారి ఖాతాల్లో జమచేస్తాం.
గత పాలకులు దోపిడీ చేసిన సొమ్మును పంచుకోవడంలో లొల్లి జరుగుతోంది. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్‌ను రాజేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అధికారులంతా జాగ్రత్తగ ఉండాలి. ప్రమాదాలు, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి’అని సీఎం సూచించారు.
మానవ వనరులను ఖాళీగా ఉండనీయం: భట్టి
రాష్ట్రంలోని మానవ వనరులను వృధాగా ఉంచలేమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడికన్నా వెళ్లాలి... లేదా ఉద్యోగమన్నా చేయాలి అని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు బడికి రావాలని, వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని నైపుణ్యాలు పొందాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు.
ఒకే రోజు 783 మందికి గ్రూప్– 2 నియామక పత్రాలు అందించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.