నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆన్‌లైన్‌లో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పరీక్ష వివరాలు, సిలబస్ వంటి వివరాలను అందులో పేర్కొన్నారు. శనివారం నుంచి ఈ నెల 29 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 27న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. వచ్చే జనవరి 3 నుంచి 31 వరకూ టెట్ పరీక్ష జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకూ, తిరిగి సాయంత్రం 2 గంటల నుంచి 4.30 వరకూ రెండు సెషన్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. టెట్ అర్హత జీవితకాలం ఉంటుంది. టెట్‌లో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హతగా పరిగణిస్తారు. పరీక్ష పేపర్ 150 మార్కులకు ఉంటుంది. సర్వీస్‌లో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.


