హైదరాబాద్: దేశ ఎకానమీని 2047 నాటికి 30 ట్రిలియన్‌లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను నంబర్ 1గా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్‌సిటీ, మూసీనది అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం అవసరమని అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టిపెడతామని చెప్పారు. తెలంగాణను నంబర్ 1 చేయడానికి రైజింగ్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.
మరోవైపు, గతంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలకు వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి?ఇప్పుడు ఎలా ఉన్నాయి? అని అన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్‌రోడ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు.


