
అమెరికా ప్రతినిధుల బృందంతో గురువారం సచివాలయంలో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
అమెరికా నిర్ణయాలు, విధానాలు సానుకూల దృక్పథంతో ఉండాలి
ఆర్థికాభివృద్ధి విధానాలే ప్రపంచానికి ఆదర్శనీయం
అమెరికా ప్రతినిధుల బృందంతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.
అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్
ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్‌లో గేమ్–ఛేంజర్ ప్రాజెక్టులుగా భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్‌రోడ్, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చరింగ్ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ – చైన్నై, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు.
500 ఫార్చ్యూన్ కంపెనీలు రావాలి
30 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.