
వీహబ్ కార్యక్రమంలో హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, వి హబ్ సీఈఓ సీత పల్లచొల్లా, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ప్రజావాణి స్టేట్ కో ఆర్డినేటర్ దివ్య దేవరాజన్
అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆడబిడ్డల ఆత్మగౌరవంతోనే రాష్ట్రం పురోగతి
మహిళా శక్తిని కాంగ్రెస్ ఎన్నడూ తక్కువ అంచనా వేయదు.. మహిళలకు వేయి మెగావాట్ల సోలార్ యూనిట్ల బాధ్యతలు
అర్బన్ మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్..
‘వి హబ్’విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి వెల్లడి
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ఆడబిడ్డల సొంతమని, రూపాయి కూడా ఎగవేయకుండా వడ్డీతో సహా అప్పులు చెల్లిస్తున్నారని కితాబునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల్లో సభ్యుల సంఖ్య కోటికి పెరగాల్సిన అవసరముందని, పట్టణ ప్రాంత మహిళలను వాటిలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘వి హబ్’(విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ హబ్) చేపట్టిన ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’, ‘గ్రాస్‌రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ను శనివారం రేవంత్‌రెడ్డి ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ‘ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానం. ఇప్పటికే వేయి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను మహిళలకు అప్పగించాం. సమర్థవంతంగా నిర్వహిస్తే మరో వేయి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అప్పగించేందుకు సిద్దంగా ఉన్నాం’అని సీఎం ప్రకటించారు.
‘మహిళా శక్తిని కాంగ్రెస్ ఎన్నడూ తక్కువగా అంచనా వేయలేదు. మహిళా శక్తికి చేయూత ఇచ్చేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలి్పంచాం, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాం, విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టడం, పెట్రోలు బంకులు, సోలార్ విద్యుత్ తదితరాల వ్యాపారాలు అప్పగించాం. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సాహిస్తూ, శిల్పారామంలో ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్‌ను కేటాయించాం’అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్
‘వి హబ్ గత ఏడేళ్లుగా మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మిషన్ మహిళా శక్తి –2025’విధానానికి అనుగుణంగా ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’ను వి హబ్ తెచి్చంది. దీనిద్వారా మహిళలు ఉద్యోగ కల్పన, సంపద సృష్టి, కొత్త తరం పారిశ్రామికవేత్తలకు ప్రేరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వి హబ్ ద్వారా త్వరలో జిల్లాల్లో ‘విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘స్కిల్ డెవలప్‌మెంట్, మినీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లు ఏర్పాటవుతాయి.
పెద్దపల్లి, పరకాల, నల్లగొండ, వికారాబాద్‌లో త్వరలో ఈ సెంటర్లు ప్రారంభమవుతాయి. వీటిలో మహిళలకు స్థానికంగా నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి సదుపాయాలు, మార్కెట్‌తో అనుసంధానం వంటి అనేక వసతులు సమకూరుతాయి’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ శర్మ, వి హబ్ సీఈఓ సీత పల్లచొల్లా, అసోసియేట్ డైరక్టర్ ఊహ సజ్జా తదితరులు పాల్గొన్నారు.
17 అవగాహన ఒప్పందాలు
విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం సందర్భంగా వి హబ్ 17 కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (హైదరాబాద్), ట్రిపుల్ ఐటీ బాసర, గీతమ్ యూనివర్సిటీ, గోదావరి, పెద్దపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, తారా డిగ్రీ కాలేజీ (సంగారెడ్డి), మథర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రి హబ్, హెచ్‌పీ ఇండియా సేల్స్, హైసియా, ఐకోనియా, టీఆర్‌డీ స్డూడియోస్, 1ఎం1ఎంబీ, నిర్మాణ్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల జాబితాలో ఉన్నాయి. ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, వరల్డ్ బ్యాంక్ సహకారంతో నడుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని 140 మంది మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈలు వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ‘గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ద్వారా గ్రామీణ యువతలో సృజనాత్మకత, సార్టప్ దృక్పథాన్ని పెంపొందిస్తారు. 6 వేలమందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.