డ్రగ్స్‌ కేసుల్లో ఎవర్నీ వదలొద్దు | Telangana CM Revanth Reddy has launched the Spandana 24X7 special teams in Hyderabad | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసుల్లో ఎవర్నీ వదలొద్దు

Apr 28 2026 1:14 AM | Updated on Apr 28 2026 1:14 AM

Telangana CM Revanth Reddy has launched the Spandana 24X7 special teams in Hyderabad

‘స్పందన’ వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీతక్క

ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉంటే అంత వేగంగా స్పందించండి.. ఎంత పెద్ద వారున్నా, ప్రముఖులు ఉన్నా ఖాతరు చేయొద్దు

ప్రముఖులను జైలుకు పంపిస్తే బలమైన సందేశం వెళుతుంది.. ‘స్పందన’ బృందాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు ల్లో ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉంటే అంత వేగంగా స్పందించండి. ఈ రకమైన వ్యవహారాల్లో ఎంత పెద్ద వారున్నా, ప్రముఖులు ఉన్నా డోంట్‌ కేర్‌ ఎనీ వన్‌ (ఎవర్నీ ఖాతరు చేయకండి).. డోంట్‌ స్పేర్‌ ఎనీ వన్‌ (ఎవర్నీ వదిలిపెట్టకండి). సామాన్యులు వెయ్యి మందిని అరెస్టు చేయడం కన్నా ప్రముఖులు ఇద్దరిని జైల్లో వేస్తే ప్రజలకు బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ పోలీసు విభాగం కొత్తగా అమల్లోకి తీసుకు వచ్చిన ‘స్పందన’ బృందాలను సీఎం సోమవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ వద్ద ప్రారంభించి మాట్లాడారు.

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తే అభివృద్ధి: ‘వివిధ కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్‌ నగర పోలీసులు ఈ స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. నేరగాళ్ల గుర్తింపు, వారికి శిక్ష పడేలా చేయడం కాలక్రమంలో జరిగినా.. బాధితులకు తక్షణ భద్రత కల్పించడానికి ఈ బృందాలు పని చేస్తాయి. మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ నేను వస్తున్నానంటే..అది మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందనే సందేశం, ఆదేశం అన్ని స్థాయిల అధికారులకు ఇవ్వడమే.

ఏ దేశంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తారో ఆయా దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలి ప్రధాని నెహ్రూ దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడి మహిళలు ఓటు హక్కు సాధించుకోవడానికి 150 ఏళ్లు పట్టింది. కానీ మన దేశంలో రాజ్యాంగంలోనే మహిళలకు ఓటుహక్కు సంబంధిత అంశాలన్నీ పొందుపరిచాం.  విద్యా, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్‌ పార్టీ 2013 లోనే బిల్లు ప్రవేశపెట్టింది..’ అని రేవంత్‌ చెప్పారు. 

పీస్‌ కమిటీలకు డ్రగ్స్‌ నియంత్రణ బాధ్యతలు: మత కలహాల సమయంలో పోలీసులకు సహకరించడానికి పీస్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. అవి అద్భుతమైన పనితీరుతో పోలీసులకు చేదోడువాదోడుగా నిలిచాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో వీరికి చేతి నిండా పని లేకుండా పోయింది. దీంతో వీరిని డ్రగ్స్, గంజాయి నియంత్రణకు వినియోగించుకోవాలని పోలీసు విభాగాన్ని ఆదేశిస్తున్నా. ఆయా ప్రాంతాల్లో జరిగే అంశాలపై సమాచారం సేకరణ, కొన్ని నిర్ణయాలను అమలు చేయడానికీ వీరి సహాయం తీసుకోండి. డీసీపీ, ఏసీపీ స్థాయిల్లో సమన్వయ సమావేశాలు పెట్టి ముందుకు వెళ్లండి. మహిళలపై జరిగే దారుణమైన నేరాల్లో అనేకం డ్రగ్స్, గంజాయి మత్తులో జరిగేవే. రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి.

దీనికోసమే ఈగల్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. ఇటీవల అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను కూడా అరెస్టు చేశాం. ఈ అంశంలో తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. పాఠశాలల్లో అడ్మిషన్‌ సమయంలోనే ఎలాంటి డ్రగ్స్‌ తదితరాలను తీసుకోమనే అండర్‌టేకింగ్‌ ఇచ్చేలా అప్లికేషన్‌లో కాలమ్‌ ఉండాలని ఇటీవల గవర్నర్‌ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రీహ్యాబ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, నగర కొత్వాల్‌ వీసీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement