Dalit Bandhu: చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్‌

Telangana: Cm Kcr To Review On Dalit Bandhu Scheme Karimnagar - Sakshi

వారిపై వివక్షను రూపుమాపడమే ‘దళితబంధు’ లక్ష్యం: సీఎం కేసీఆర్‌

ఇది చిల్లరమల్లర ఓట్ల పథకం కాదు 

ప్రతి కుటుంబాన్ని పేరుపేరునా అభివృద్ధి చేస్తాం..

ఎస్సీల్లోని అన్నిఉప కులాలకు ఇది వర్తిస్తుంది 

కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్‌ ఇచ్చే ఆలోచన చేస్తామని వెల్లడి 

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘‘మొన్నీ మధ్య టీవీలో చూసిన.. ఉత్తరభారతంలో ఓ దళిత యువకుడు పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కిం డని కొందరు అతన్ని కొట్టి చంపారు. ఎవడు పెట్టిండో, ఎప్పట్నుంచి పెట్టిండోగానీ ఈ దుర్మార్గమైన ఆచారం ఇంకా పోలేదు. సమాజంలో ఇప్పటికీ దళితులంటే చిన్నచూపే, అంటరానితనం పోయినా వివక్ష పోలేదు. ఆ వివక్షను రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. దళితుల జీవితాలు పూర్తిగా మారాలి. అందుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. కునారిల్లుతున్న కులవృత్తుల వారికోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నామని తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ‘దళితబంధు’ పథకంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

అన్ని వర్గాలకు అండగా.. 
‘‘తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. నిరంతరాయంగా కరెంటు ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనులకు పోయిన రాష్ట్రంలో ఇప్పుడు.. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా మా ప్రభుత్వం నిలబడింది. అన్ని రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ నేనున్నాననే ధీమాను ప్రభుత్వం అందిస్తోంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని అందరి సహకారంతో తప్పకుండా విజయవంతం చేస్తాం. దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం  చదవండి: 27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే.. 

ఇది ఓట్ల కోసం కాదు.. 
సబాల్ట్రన్‌ స్టడీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశాం. ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్నయనే విషయాన్ని గుర్తించాం. భారతదేశ దళితుల పరిస్థితి కూడా ఆ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయం నిర్ధారణ అయింది. అందుకే దళితుల అభివృద్ధి కోసం పథకం తెస్తున్నాం. ఇది చిల్లర మల్లర ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు, ఆదరాబాదరా అవసరం లేదు. ప్రతి దళిత కుటుంబాన్ని పేరు పేరునా అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా ఎలా అందిస్తున్నామో.. అదే పద్ధతిలో దళితబంధుకు కూడా పరిమితులు ఉండవు. దళితబస్తీల్లోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు కూడా దళితబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకు దళిత బంధు వర్తిస్తుంది. హుజూరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచుతుంది. అణగారిన దళితవర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుంది. 

భిన్నమైన పనులు ఎంచుకోండి 
అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత లబ్ధి పొందవచ్చు. అధికారులు దళితబంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలున్న కరపత్రాన్ని వెంట తీసుకెళ్లి.. ఆయా వ్యాపార, ఉపాధి మార్గాలను లబ్ధిదారులకు వివరించాలి. లబ్ధిదారులు స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్‌ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తాం. హాస్టళ్లు, హాస్పిటళ్లు, విద్యుత్‌ రంగ సంస్థలకు వివిధ మెటీరియల్‌ సరఫరా, సివిల్‌ సప్లయ్స్‌ రంగాల్లో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తాం. కాంట్రాక్టుల విషయంలోనూ కొంత రిజర్వేషన్‌ కోసం ఆలోచన చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. చదవండి: తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!

హుజూరాబాద్‌లో డెయిరీ ఏర్పాటు చేయండి 
ఎస్సీ వెల్ఫేర్‌ మంత్రి, బీసీ వెల్ఫేర్‌ మంత్రి, కరీంనగర్‌ జిల్లా వారే కావడం, ఆర్థికమంత్రిది కూడా పక్క నియోజకవర్గమే కావడంతో.. హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్‌ డెయిరీ విజయం గర్వకారణమని చెప్పారు. దళితబంధు పథకంలో భాగంగా ఔత్సాహికులు డెయిరీ ఫారాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హుజూరాబాద్‌లో డెయిరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కరీంనగర్‌ డెయిరీ నిర్వాహకులు.. ‘అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్, మేయర్‌ సునీల్‌రావు, అధికారులు పాల్గొన్నారు. 
 
సీఎం ఎత్తుకున్న శిశువుకు కేటీఆర్‌ పేరు 
కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం రామగుడు ఎంపీపీ ఎలిగేటి కవిత–లక్ష్మణ్‌ దంపతులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమకు కుమారుడు జన్మించాడని, ఆశీర్వాదించాలని కోరారు. కేసీఆర్‌ ఆ చిన్నారిని ఎత్తుకుని ఆశీర్వదించారు. తర్వాత కవిత–లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడికి కేటీఆర్‌ అని పేరు పెట్టుకుంటున్నామని తెలిపారు. 

‘దళితబంధు’తో పునరుత్పాదకత 
రాష్ట్రంలో పరిశ్రమలకోసం ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయి. అలాగే మేం 1.75 లక్షల కోట్ల రూపాయలను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా.. అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. 

రిజర్వేషన్లు పెంచుకుందాం
రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. రాష్ట్ర జనాభాలో సుమారు 18 శాతం మేర..
అంటే సుమారు 75 లక్షల దళిత జనాభా ఉంది. వారి జనాభా పెరుగుతున్నది. దానికి తగ్గట్టు రాబోయే కాలంలో దళిత రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. 

 
ఏం నర్సయ్యా.. హైదరాబాద్‌ రా.. 
 మొగ్ధంపూర్‌ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం 
కరీంనగర్‌ రూరల్‌:  
కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణభవన్‌లో బస చేసిన సీఎం కేసీఆర్‌ను.. కరీంనగర్‌ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మొగ్ధుంపూర్‌ సర్పంచ్‌ జక్కం నర్సయ్యను కేసీఆర్‌ పలకరించారు. ‘పిల్లలు బాగున్నారా.. అంతా మంచిదేనా.. ఒకసారి హైదరాబాద్‌ రా..’ అని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నర్సయ్య సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు కేసీఆర్‌ ఇలా నర్సయ్యను ప్రత్యేకంగా పలకరించడం, హైదరాబాద్‌కు ఆహ్వానించడం అందరికీ ఆసక్తి కలిగించింది. 

చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top