27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే.. 

Employees In The Forest Department Suffering For Low Salary - Sakshi

అటవీ శాఖలో టైంస్కేల్‌ ఉద్యోగుల వెతలు 

శాశ్వత ఉద్యోగుల విధులే నిర్వహిస్తున్నా అందని ప్రయోజనాలు

సాక్షి, హైదరాబాద్‌: శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నా నెలకు జీతం, డీఏ కలిపి రూ.22 వేలు మాత్రమే వస్తోందంటూ అటవీశాఖ టైమ్‌స్కేల్‌ ఉద్యోగులు వాపోతున్నారు. 1994 నుంచి ఒప్పంద పద్ధతిలో, 2009 నుంచి శాంక్షన్డ్‌ పోస్టుల్లో పనిచేస్తున్నా, ఇంక్రిమెంట్లు, హెచ్‌ఆర్‌ఏ తదితరాలేవీ వీరికి చెల్లించడం లేదు. ఉద్యోగులు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, డ్రైవర్లు ఇలా మొత్తం 88 మంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నా రు. వీరిలో 19 మందిని 2017లో క్రమబద్దీకరించడంతో వారికి  శాశ్వత ఉద్యోగులకు చెల్లించాల్సి నవన్నీ చెల్లిస్తున్నారు. మిగతా వారికి అన్ని అలవెన్స్‌ల చెల్లింపు, క్రమబద్దీకరణకు సంబంధించి 2017లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

వీరి సర్వీసులను క్రమబద్ధీకరించవచ్చునని ఆర్థికశాఖ కూడా మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపింది. అయినా ఇప్పటికీ దానికి మోక్షం లభించలేదు. వీరిలో నలుగురు మరణించగా వారి కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందలేదు. ఆరుగురు పదవీ విరమణ చేసినా రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందలేదు. మరో ఏడాదిలో 16 మంది అటెండర్లు, వాచ్‌మెన్లు రిటైర్‌ కానున్నారు. వీరికి సెలవుల వర్తింపు లేకపోవడంతో పాటు యూనిఫామ్‌ వంటి అలవెన్స్‌లూ వర్తించవు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రులకుఅధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వీరు విధుల్లో చేరినప్పుడు బీట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌కు కనీస విద్యార్హత పదోతరగతి కాగా, 2014 తర్వాత దానిని ఇంటర్‌కు మార్చడంతో వీరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇంటర్‌ విద్యార్హత ఉన్న 19 మంది ఉద్యోగాలు అప్పట్లో రెగ్యులరైజ్‌ అయ్యాయి.  తమకూ మినహాయింపులిచ్చి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top