
సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, రవిగుప్తా, సీవీ ఆనంద్ తదితరులు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక
ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేయాలనుకొనే వారికి ఆపరేషన్ సిందూరే సమాధానమని స్పష్టికరణ
140 కోట్ల మంది భారతీయులంతా సైన్యానికి అండగా నిలబడతారని వ్యాఖ్య
దేశ సార్వబౌమాధికారంపై ఎవరు దాడి చేసినా వదలబోమనే సందేశాన్ని ఇస్తున్నట్లు వెల్లడి
సైన్యానికి సంఘీభావంగా సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ
ఖైరతాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తూ భారత సార్వబౌమాధికారంపై దాడి చేయాలనుకొనే వారికి ఈ భూమిపై నూకలు చెల్లినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారు భూమ్మీద నివసించేందుకు అర్హత కోల్పోయినట్లేనని తేల్చిచెప్పారు. ‘పాక్ ఉగ్రవాదులు, పాక్ పాలకులు సహా అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశ సార్వబౌమత్వంపై దాడి చేయాలనుకొని భారత్ వైపు చూస్తే వారికి ఈ భూమిపై నూకలు చెల్లినట్లే’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన జాతీయ సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ పొడవునా సీఎం జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడి మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్‌తోనే సమాధానం..
భారతదేశ శాంతి ఆకాంక్షను చేతకానితనంగా భావించి ఎవరైనా భారత భూభాగంలో కాలుమోపి ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచి వేయాలనుకొనే వారికి ఆపరేషన్ సిందూరే సమాధానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుమూకను నేలమట్టం చేసే శక్తి మన జవాన్లకు ఉందన్నారు. వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా నిలబడతారని రేవంత్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా... పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులంతా భరతమాత రక్షణలో ఏకమై... దేశ సార్వబౌమాధికారంపై ఎవరు దాడి చేసినా వదలబోమనే సందేశాన్ని తెలంగాణ నడిగడ్డ నుంచి వీర జవాన్లకు ఇస్తున్నామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కలిసి సంపూర్ణంగా అండగా నిలబడతామని.. ఉగ్రవాదుల పీచమణచాలని మద్దతిచ్చారని సీఎం చెప్పారు.
గాందీజీ శాంతియుత పోరుతోనే పాక్‌కూ స్వాతంత్య్రం..
భారత్‌తోపాటు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ సైతం స్వాతంత్య్రాన్ని పొందిందంటే అందుకు జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన శాంతియుత పోరాటమే కారణమని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని పాక్ తెలుసుకోవాలన్నారు. భారత్ తలుచుకుంటే పాక్ ప్రపంచ పటంలో ఉండదని హెచ్చరించారు.