విద్వేషంపై ఉక్కుపాదం! | Telangana Cabinet clears Hate Speech and Parents Support Bills | Sakshi
Sakshi News home page

విద్వేషంపై ఉక్కుపాదం!

Mar 24 2026 3:20 AM | Updated on Mar 24 2026 3:20 AM

Telangana Cabinet clears Hate Speech and Parents Support Bills

విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

వర్సిటీల్లో కులవివక్ష కట్టడికి రోహిత్‌ వేముల చట్టానికి నిర్ణయం

డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత!

తల్లిదండ్రులకు మద్దతు బిల్లును ఆమోదించిన మంత్రివర్గం

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్‌ స్పీచ్‌ అండ్‌ హేట్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ బిల్లు, 2026)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా చేసే పోస్టులు, అల్లర్లు.. ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.

కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారు సైతం ఇదే తరహా బిల్లును శాసనసభలో ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. దీంతో గవర్నర్‌ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. హేట్‌ స్పీచ్‌ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం శాసనసభ కమిటీ హాల్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

వర్సిటీల్లో కుల వివక్ష నియంత్రణకు..
విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్‌ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు. 

గిగ్‌ వర్కర్స్‌కు భద్రత    
గిగ్, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌ గిగ్‌ వర్కర్స్‌ (రిజిస్ట్రేషన్, సోషల్‌ సెక్యూరిటీ అండ్‌ వెల్ఫేర్‌) యాక్ట్‌ – 2026’ బిల్లును కూడా  మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని దాదాపు 4.2 లక్షల మంది గిగ్‌ వర్కర్స్, ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌ వర్కర్లకు  ప్రయోజనం కలగనుంది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్‌ రిజిస్ట్రేషన్‌తో పాటు సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేస్తారు. గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు బోర్డు ఏర్పాటు ద్వారా వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్‌ ఆమోదించింది.

మెట్రో స్వాధీనం చర్యలు వేగవంతం
హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను ఎల్‌ అండ్‌ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం
తెలంగాణ అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో అడ్వకేట్‌ వామనరావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కులగణనపై కమిటీ నివేదికకు ఆమోదం
రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఇండిపెండెంట్‌ ఎక్స్‌పర్ట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 2024 నవంబర్‌ 6వ తేదీ నుంచి డిసెంబర్‌ 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. కాగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్‌ సబ్‌ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.

తల్లిదండ్రులకు భరోసా..
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతి నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఏది తక్కువైతే ఆ మొత్తం వేత నాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రులకు మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది.

Advertisement
 
Advertisement
Advertisement