
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ.. సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా బీజేపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు అని హితవు పలికారు. రాజకీయ నాయకులు వీటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాజకీయపరమైన వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అని వ్యాఖ్యానించారు. చివరగా.. పది లక్షల జరిమానా విధిస్తామని బీజేపీని హెచ్చరించారు. అనంతరం, పిటిషన్‌ను కొట్టివేశారు.
ఇదిలా ఉండగా.. గతంలో ఇదే విషయంపై బీజేపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సైతం కొట్టివేసింది. దీంతో, రాష్ట్ర బీజేపీ.. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా మరోసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
