
పుట్టిన ఊరిలోని బడిపై విద్యార్థిని మమకారం
కుటుంబం వలస వెళ్లినా సొంతూరి బడికొచ్చి చదువు
మానకొండూర్: కిలోమీటర్ దూరంలో బడి ఉంటేనే.. అబ్బా అంత దూరమా! అని ఉసూరుమనే విద్యార్థులున్న ఈ కాలంలో ఓ విద్యార్థిని తాను పుట్టి పెరిగిన ఊరిలోని బడిపై మమకారాన్ని వదులుకోలేక, అక్కడి స్నేహితులను వదిలి ఉండలేక రోజూ ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి సర్కారు బడికి వచ్చి చదువుకుంటోంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన పానేటి నర్సయ్య, దుర్గమ్మ దంపతుల చిన్న కూతురు పద్మ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
సంచారజాతికి చెందిన నర్సయ్య, దుర్గమ్మ ఏడాదిలో ఆరు నెలలు వలస వెళ్తారు. ప్రస్తుతం వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి వలసవెళ్లారు. తల్లిదండ్రులతోపాటు పద్మ కూడా వెళ్లింది. అయితే, పద్మ మనసంతా పుట్టిన ఊరు.. పాఠశాలపైనే ఉంది. దీంతో మానకొండూర్ పాఠశాలలోనే చదువుకుంటా అని తల్లిదండ్రులతో చెప్పింది.
ఇల్లంతకుంట నుంచి రవాణా సౌకర్యం లేకపోవడంతో వేములవాడలో ఉంటున్న అమ్మమ్మ వద్ద ఉంటూ, నిత్యం వేములవాడ నుంచి మానకొండూర్‌కు బస్సులో బడికి వచ్చి వెళ్తోంది. ఇంట్లో నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి.. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ఇల్లు చేరుకుంటోంది. రానుపోను నిత్యం 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తోంది.