
విదేశీ విద్యానిధి పథకం కోటా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
బీసీలకు, ఈబీసీలకు చెరో 200 యూనిట్లు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించే విదేశీ విద్యానిధి పథకం కోటాను పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోటాను భారీగా పెంచగా... తాజాగా బీసీ, ఈబీసీ కోటాను పెంచింది. బీసీ, ఈబీసీలకు చెరో 200 యూనిట్లు చొప్పున మంజూరు చేస్తూ గత నెల 27న బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంపై బీసీ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనాభా ప్రాతిపదికన బీసీలకు వాటా ఇవ్వాలంటూ ఒకవైపు రాష్ట్రమంతటా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, బీసీలకు, ఈబీసీలకు ఒకే విధమైన కోటా ఇవ్వడం పట్ల బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ ఉత్తర్వుల కాపీ మాత్రం ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌కు అందలేదని అధికారులు చెబుతున్నారు.
భారీ డిమాండ్... పెంపు అంతంతే
బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏటా 6 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుండగా... 300 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో బీసీ విద్యార్థులు 285 మంది ఉండగా... 15 మంది ఈబీసీలుంటున్నారు. దీనిపై మెజార్టీ విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతుండటంతో బీసీ కోటా పెంచాలంటూ కొంత కాలంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు.
కనీసం వెయ్యి యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో బీసీలకు 200, ఈబీసీలకు 200 యూనిట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన యూనిట్లతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 700 మందికి అవకాశం కల్పిస్తారు. తాజా పెంపుతో బీసీలకు 500 యూనిట్లు, ఈబీసీలకు 200 యూనిట్లు మంజూరు చేస్తారు. ఈ కోటా పెంపుపై అటు బీసీ సంక్షేమ శాఖ అధికారులు... ఇటు బీసీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వెయ్యి మందికి అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు పంపితే కేవలం 200 యూనిట్లు పెంచడంపై మండిపడుతున్నారు.
మరోవైపు ఈబీసీల కోటా పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు లేకున్నా వారికి 200 యూనిట్లు కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు ఈ అంశంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ కోటా మరింత పెంచాలనే డిమాండ్ వినిపించారు. ఒకట్రెండు రోజుల్లో సీఎంను కలిసి బీసీ కోటా పెంచాలని కోరతామని మంత్రి చెప్పినట్లు బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు.