
ఫైటర్ జెట్ కాక్‌పిట్ సిమ్యులేటర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో టీ వర్క్స్ సీఈఓ జోగిందర్ తనికెళ్ల
యాక్సిల్ ఏరో ప్రైవేటు లిమిటెడ్ ద్వారా వాణిజ్య ఉత్పత్తి
అమెరికా, యూరప్ నుంచి దిగుమతి అవసరం లేనట్లే
మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేసేలా సాంకేతికత వృద్ధి
ఒక్కో ఫైట్ జెట్ సిమ్యులేటర్‌పై రూ.25 కోట్లకు పైనే ఆదా
సాక్షి, హైదరాబాద్: డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్.. మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అదీనంలో టీ వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల ఫ్లైట్ ‘సిమ్యులేటర్’రూపుదిద్దుకుంటోంది. ఎయిర్‌ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే ‘లెవెల్ డి’ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్లను ఇప్పటి వరకు భారీ వ్యయంతో అమెరికా, యూరప్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇకపై ఆ అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు.
భవిష్యత్తులో ఫ్లైట్ సిమ్యులేటర్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయగలిగే సాంకేతికత ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ పైలట్లకు మొదట ఫ్లైట్ సిమ్యులేటర్లలో శిక్షణ ఇస్తారు. విమానం ఎగిరే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్‌ను గాలిలో నడిపిన అనుభూతిని ఇస్తాయి.
కాక్‌పిట్‌లో కూర్చుని బయటి నుంచి శిక్షకులు ఇచ్చే సూచనల ప్రకారం ఎల్రక్టానిక్ వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్, తలకిందులుగా ఎగరడం లాంటి అన్ని రకాల విన్యాసాల శిక్షణ సిమ్యులేటర్ ద్వారా లభిస్తాయి. యుద్ధ విమానాల్లో ఉండే ఎలక్ట్రానిక్, ఆటోమెటిక్ నియంత్రణ వ్యవస్థలన్నీ ఇందులో ఉంటాయి. ఎదురుగా అర్ధ చంద్రాకారంలో ఉండే స్క్రీన్ పైన ఫైటర్ జెట్ కదులుతున్న దృశ్యాలు కనిపిస్తాయి.
సిమ్యులేటర్ల తయారీకి అనుమతులు
యాక్సిల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సిమ్యులేటర్ల తయారీకి అన్ని అనుమతులు సాధించి వాణిజ్య ఉత్పత్తి మొదలు పెట్టింది. వచ్చే మూడేళ్లలో ఐదు సిమ్యులేటర్లను సరఫరా చేయడానికి రక్షణ శాఖ నెలకొల్పిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడెక్స్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం మన ఎయిర్‌ఫోర్స్ దిగుమతి చేసుకుంటున్న ఒక్కో ఫైటర్ జెట్ సిమ్యులేటర్ వ్యయం రూ.50 కోట్ల వరకు ఉండగా.. యాక్సియల్ ఏరో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లకే అందజేస్తుంది.
టీ–వర్క్స్ లో పరిశోధనలు సాగిస్తున్న ఈ సంస్థ.. ఎయిర్‌ఫోర్స్, నేవీ అవసరాలకు తగిన విధంగా ఫ్లైట్ సిమ్యులేటర్లను తయారు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న సిమ్యులేటర్లతో పోలిస్తే ఇక్కడ తయారయ్యే సిమ్యులేటర్లు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను కలిగి ఉంటాయి. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న సిమ్యులేటర్లు అన్ని వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే వంగడం, లేవడం చేయగలుగుతాయి.
యాక్సిల్ ఏరో రూపొందిస్తున్న సిమ్యులేటర్లు 360 డిగ్రీల కోణంలో తిరిగే స్టివార్టు ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంటాయి. దీని వల్ల యుద్ధ క్షేత్రంలో శత్రువుకు దొరకకుండా తప్పించుకునేందుకు ఫైటర్ జెట్లను నడిపించే పైలట్లు అనుసరించే విన్యాసాలన్నీ ఇందులో సాధ్యమవుతాయి. సిమ్యులేటర్ల వాణిజ్య ఉత్పత్తి ఊపందుకుంటే విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలు పుట్టుకొచ్చి ఎంఎస్‌ఎంఈ రంగానికి మేలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు భవిష్యత్తులో హైదరాబాద్ ఫ్లైట్ సిమ్యులేటర్ల ఉత్పత్తి కేంద్రంగా నిలవడంతోపాటు ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టీ వర్క్స్’ను సందర్శించి ఫ్లైట్ సిమ్యులేటర్ల పురోగతిని పరిశీలించారు.