ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..! | Shocking Facts Revealed In Gadwal Surveyor Tejeshwar Case, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!

Jun 24 2025 7:52 AM | Updated on Jun 24 2025 10:19 AM

Shocking Facts In Surveyor Tejeshwar Case

భార్య సహస్ర పథకం ప్రకారమే హత్యోదంతం! 

మర్డర్‌ కేసులో విచారణ వేగవంతం 

పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తులు

గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్‌ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్‌ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్‌కు జీపీఎస్‌ ట్రాకర్‌ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది.

 సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్‌ఫార్మర్‌ ద్వారా తేజేశ్వర్‌పై నిఘా పెట్టారు. జీపీఎస్‌ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్‌ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్‌ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు.  

కేసు విచారణ వేగవంతం
తేజేశ్వర్‌ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్‌ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌
తేజేశ్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్‌ఐలు కల్యాణ్‌కుమార్, మల్లేశ్, శ్రీకాంత్‌ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్‌ రింగ్‌ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్‌రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్‌లై ఓవర్, తుంగభద్ర ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు.  

హత్యకు ముందే పరిచయం.. 
తేజేశ్వర్‌ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్‌ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్‌కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్‌ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

పోలీసుల అదుపులో అనుమానితులు?
పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్‌ఫార్మర్‌ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్‌ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement