ఆ 5 ఎకరాలు మావే | SBI moves High Court over e auction of TSIIC lands in Knowledge City | Sakshi
Sakshi News home page

ఆ 5 ఎకరాలు మావే

Jun 18 2026 3:22 AM | Updated on Jun 18 2026 3:22 AM

SBI moves High Court over e auction of TSIIC lands in Knowledge City

నాలెడ్జ్‌ సిటీలోని టీజీఐఐసీ భూముల ఈ–వేలంపై హైకోర్టుకు ఎస్‌బీఐ

2010లో ప్రభుత్వం తమకు విక్రయించినట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో ఇటీవల ప్రభుత్వం ఎకరా రూ.237 కోట్లకు వేలం ద్వారా విక్రయించిన భూమి తమదేనంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన 5 ఎకరాల భూమిని తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) ఈ–వేలం ద్వారా విక్రయించడాన్ని సవాల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పణ్మక్తా హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో సర్వే నంబర్‌ 83/1లోని ప్లాట్‌ నంబర్‌–1ఏ (5 ఎకరాలు)ను ప్రభుత్వం 2010లో జారీ చేసిన జీవో 501 ప్రకారం పూర్తిస్థాయి విక్రయ పద్ధతిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌)కు కేటాయించిందని పేర్కొంది. దీని కోసం రూ.13.33 కోట్లను చెల్లించామంది. 

అనంతరం ఎస్‌బీహెచ్‌.. ఎస్‌బీఐలో విలీనమైందని గుర్తు చేసింది. ఈ–వేలం నోటిఫికేషన్‌ను ఇప్పటికే మరో రిట్‌ పిటిషన్‌లో సవాల్‌ చేసినప్పటికీ, ఆ కేసు విచారణలో ఉండగానే మే 28న వేలం నిర్వహించి గౌరా వెంచర్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ప్రకటించారని తెలిపింది. భూమి విక్రయ ధరను ప్రభుత్వం ఇప్పటికే స్వీకరించిన నేపథ్యంలో తిరిగి అదే భూమిని వేలం వేయడానికి చట్టబద్ధమైన అధికారం లేదని కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ముంబై తరువాత దేశంలో రెండో కార్పొరేట్‌ ఆఫీసును ఎస్‌బీఐ హైదరాబాద్‌లో రెండు టవర్లలో నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వేలంలో జరిగిన విక్రయాన్ని రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement