దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాం

RSS Chief Mohan Bhagwat Inaugurates ABVP Building In Hyderabad - Sakshi

ఏబీవీపీ సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌  

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చాలా త్యాగనిరతులని ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ బాగా ప్రాచుర్యం పొందితే, భవిష్యత్తులో కొందరికి అడ్డంకి కావచ్చని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు.

హింస ద్వారా సత్యం మరణించలేదని అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కార్యకర్త అంటే హేళన చేసేవారని, కానీ, ఇప్పుడు అది నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ఏబీవీపీ కార్యకర్తలు బలిదానాలు చేశారని కొనియాడారు. దేశంపట్ల విద్యార్థులు ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే పెద్ద ఆనందం, గర్వం ఏముంటుందని అన్నారు.

మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని భగవత్‌ పేర్కొన్నారు. ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఆశీష్‌ చవాన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను నిర్మించటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థి సమస్యలపై ఏక్తామార్గంలో ఏబీవీపీ సమరశీల పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సమ్మేళనంలో ఏబీవీపీ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శేఖర్, రాజేందర్‌రెడ్డి, శంకర్, నిధి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ శేషగిరిరావు రచించిన ‘దేశ చరిత్ర–పునర్జీవనం–సంస్కృతి’అనే పుస్తకాన్ని మోహన్‌ భగవత్‌ ఆవిష్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top