Revanth Reddy Alleges KTR PA Name in TSPSC Question Paper Leak - Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్స్‌లో కేటీఆర్‌ పీఏ హస్తం.. పెద్ద తలకాయల్ని కాపాడేందుకేనంటూ రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

Mar 18 2023 7:40 PM | Updated on Mar 18 2023 9:21 PM

revanth reddy alleges KTR PA Name In tspsc paper leak - Sakshi

పేపర్‌ లీకేజీ గురించి ప్రశ్నిస్తే.. ఐటీ మంత్రి ఏం చేస్తారో తెలుసా అంటూ కేటీఆర్‌..  

సాక్షి, కామారెడ్డి: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. పేపర్‌ లీక్‌లో కేటీఆర్‌ పీఏ తిరుపతి పాత్ర ఉందని ఆరోపించారాయన. తిరుపతి స్వస్థలం కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో గ్రూప్‌-1 రాసిన వంద మందికి వందకు పైగా మార్కులొచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారాయన. మరోవైపు.. 

తెలంగాణలో అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అంటూ రేవంత్‌ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకేజీ ఇష్యూ పరిశీలిస్తే.. మొదట హానీ ట్రాప్ అని, రెండోసారి హ్యాకింగ్ జరిగిందని చెప్పారు. ఆ తరువాత ఏకంగా లీకయిందని చెప్పారు. నిజాలు బయటకు వస్తుండటంతో పరీక్షలను రద్దు చేశారు. లీకేజీ ఇష్యులో ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. మరోవైపు ఐటీ మంత్రి ఏం చేస్తారో తెలుసా అంటూ కేటీఆర్ తోండి వాదనకు దిగుతున్నారు. ఇంకోవైపేమో రెండో ముద్దాయి బీఆర్‌ఎస్ వాళ్లని బీజేపీ చెబుతోంది. 

.. బీఆర్‌ఎస్‌, బీజేపీ లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ వ్యవహారంలో కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు. ఇదే మొదటిసారి జరిగినట్లు మంత్రి మాట్లాడుతున్నారు. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ చేసేందుకు జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. కవితకు కూడా అందులో భాగస్వామ్యం ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. 2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకైంది. దీనివల్ల మూడు సార్లు అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయాల్సి వచ్చింది’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

.. 2017 మరోసారి సింగరేణి నియామకాల్లో ప్రశ్నాపత్రం లీకైంది. 2019లో ఇంటర్ మూల్యాంకణం లోపభూయిష్టంగా జరిగింది. 60వేల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్ మూల్యాంకనం అప్పగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్లోబరీనా విషయంపై ప్రశ్నించిన మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ దాడులు చేయించి జైల్లో పెట్టారు. పరీక్షలను రద్దు చేయడం కూడా గొప్పతనం అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలన్నింటిపై విచారణ చేయాలి. 

కామారెడ్డిలో హత్‌ సే హత్‌ జోడో పాదయాత్రలో పాల్గొంటున్న ఆయన కార్నర్‌ మీటింగ్‌లో ఈ అంశంపై మాట్లాడారు.  ఈ సందర్భంగా.. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జిచేత విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని, అలాగే ఆదివారం నుంచి ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమైనట్లు ప్రకటించారాయన. ఇక మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు రేవంత్‌ రెడ్డి. 

ఐటీ మంత్రిగా పేపర్‌ లీక్‌ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కేటీఆర్‌ అంటున్నాడు. మరి ఏ బాధ్యతా లేదన్నప్పుడు.. సీఎం నిర్వహించిన సమీక్షలో ఎందుకు పాల్గొన్నావ్‌?. విద్యాశాఖ మంత్రి సబితనో, మరో మంత్రి శ్రీనివాసగౌడ్‌ మాట్లాడకుండా.. ఐటీ మంత్రిగా ఉన్న నువ్వేందుకు మీడియాతో మాట్లాడావ్‌? సమీక్ష వివరాలను ఎందుకు మీడియాకు ఇచ్చావ్‌? అని రేవంత్‌, కేటీఆర్‌పై మండిపడ్డారు. 
 
పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో.. మొత్తం కేబినెట్‌ను పిలవలేదని, విచారణ అధికారులను కూడా ఎందుకు పిలవలేదని, కేవలం కేటీఆర్‌, హరీష్‌రావులు మాత్రమే హాజరయ్యారని మండిపడ్డారాయన. అంతేకాదు.. తొమ్మిది మంది నిందితులుగా ఉన్న కేసులో రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు మాత్రమే నేరం చేశారంటూ కేటీఆర్‌ మాట్లాడుతుండడం.. జడ్జిమెంట్‌ రాసేసినట్లు ఉందన్నారు రేవంత్‌. రాష్ట్రంలో అన్నీ పైరవీలే నడుస్తున్నాయి. ఎగ్జామ్‌ పేపర్లు లీక్‌ అవుతున్నాయి. వీటి వెనుక బీఆర్‌ఎస్‌కు చెందిన బడా నేతలు ఉన్నారు. 

వాళ్లను తప్పించేందుకే ఇద్దరు మాత్రమే నేరానికి పాల్పడ్డారంటూ కేటీఆర్‌ ప్రకటించారు. ఇంటి దొంగలను ఎక్కడ బయటపడతారేమో అనే ఆందోళనతోనే కేటీఆర్‌ హడావిడిగా బయటకు వచ్చారంటూ ఆరోపించారు రేవంత్‌. ఈ తతంగంలో చిన్న చేపలను కాకుండా.. తిమింగలాలను బహిరంగంగా శిక్షించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ సమావేశాలు, సమీక్షలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.

ఇదీ చదవండి: టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ నుంచి రెండు కంప్యూటర్లు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement