
సాక్షి, బంజారా హిల్స్: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కొంత మంది రెక్కీ నిర్వహించినట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో ముగ్గురు యువకులు పవన్ ఇంటి ముందు కారు ఆపిన సమయంలో బౌన్సర్లతో వాగ్వాదం జరిగిందని, ఇందులో భాగంలో బౌన్సర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..శ్రీరామ్ నగర్ చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి, చిట్నేని విజయ్ ఆదిత్య చౌదరి, జవహర్ నగర్‌కు చెందిన వినోద్ ముగ్గురు కలిసి గత నెల 31వ తేదీ రాత్రి 12:15 సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35 లోని తబలా రసా పబ్‌లో మద్యం సేవించి బయటకు వచ్చిన తర్వాత వారి (జీజే 21ఏహెచ్ 1905) టాటా సఫారీ కారులో వెళుతూ పవన కళ్యాణ్ ఇంటి ముందు కారును అపి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కారు ఎందుకు అపారని పవన్ బౌన్సర్లు వెంకటేష్, ప్రసాద్ వారిని ప్రశ్నించారు. మేమిక్కడ కారు ఆపితే మీకేం సమస్య అంటూ కారులో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ప్రశ్నించగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇది పవన్ ఇల్లు అని బౌన్సర్లు చెప్పినా వినకుండా దుర్భాషలాడారు. ఈ గొడవలో బౌన్సర్ ప్రసాద్‌కు గాయమైంది. ఈ మేరకు ఈ నెల 1న ఉదయం 11:30 గంటలకు జనసేన నేతలతో కలిసి బాధిత బౌన్సర్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు ముగ్గురు యువకులపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారని, గత రెండు రోజుల నుంచి మీడియా లో వార్తలు ప్రసారం అవుతున్నాయని, టీఎస్ 15 ఈక్యూ 6677 కారులో వచ్చారంటూ ప్రసారాలు చేస్తూ ఆరోపిస్తున్నారని, ఆ కారుతో గాని, ఆ రోజు పవన్ ఇంటి వద్ద జరిగిన గొడవకు ఈ కారుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.