ప్రశాంతంగా శ్రీరామ నవమి శోభాయాత్ర : అధికారులు సిద్ధం | Rama Navami procession in Hyderabad officers meet | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా శ్రీరామ నవమి శోభాయాత్ర : అధికారులు సిద్ధం

Mar 23 2026 6:12 PM | Updated on Mar 23 2026 6:21 PM

Rama Navami procession in Hyderabad officers meet

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ గరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్, పాల్గొన్నారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసు కోవాల్సిన చర్యలపై చర్చించారు.

2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపు కోవాలని కోరారు. ఇందుకోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుతోపాటు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

శోభాయాత్రను మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.  ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి,ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీమతి శశికల (మాజీ కార్పొరేటర్), లాల్ సింగ్ (మాజీ కార్పొరేటర్) అందరూ శోభాయాత్ర సందర్భంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించగా, అన్నింటిని పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం శోభాయాత్ర వెళ్లే రూట్‌ను పరిశీలించారు.

ఈ సమావేశంలో అడిషనల్ సీపీ  తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్,ఎన్. శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement