నిజమైన తెలంగాణ వాదులు ఈ ఇద్దరు

Please Vote For Chinna Reddy And Ramulu Naik In Graduate Election uttam Request - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్‌లను గెలిపించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. చిన్నారెడ్డి నిజాయితీ గల వ్యక్తని, వ్యవసాయ రంగంపై పీహెచ్‌డీ చేసిన వ్యక్తని అన్నారు. రాజకీయాలు మొత్తం కమర్షియలైన ఈ సమయంలో ఏ మాత్రం ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తని కొనియాడారు. రాములు నాయక్ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. చిన్నారెడ్డి, రాములు నాయక్‌లు నిజమైన తెలంగాణ వాదులని, ఇద్దర్నీ గెలిపించాలని ఉత్తమ్‌ కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘  నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బకు ఈ ప్రకటన చేశారు. కానీ, ఇవ్వలేదు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా దెబ్బ కొడితే రావాల్సిన 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఇవన్నీ రావాలంటే టీఆర్ఎస్‌ని చిత్తు చిత్తుగా ఓడించాలి. పీఆర్సీ కూడా నివేదిక ఇచ్చింది. ఉద్యోగాల ఖాళీలు భారీగా ఉన్నాయని చెప్పింది. ( ఎమ్మెల్సీ ఎన్నికలు; వ్యూహరచనలో కాంగ్రెస్‌ )

43 శాతం ఫిట్మెంట్ తగ్గితే టీఆర్ఎస్‌ని ఓడించండి. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తగ్గింది. అందుకే టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పే విధంగా రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండి. బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని తీసుకురావడంలో బండి సంజయ్ విఫలమయ్యారు. మేము కూడా హిందువులమే.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి మేము వ్యతిరేకం  కాదు. భద్రాచలం రామాలయం భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది కేంద్రమే. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ని ఓడించాలి. విద్యా వ్యాపారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క పైసా పని చేయలేదు’’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top