
2004 నాటి కేసులో 2013లో అరెస్టయిన పాకిస్థానీ
సరైన సాక్ష్యాధారాలు లేక 2015లో వీగిన కేసు
తమ దేశీయుడని అంగీకరించని దాయాది దేశం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, గూఢచర్యం, వీరికి సహాయ సహకారాలు అందించడం కోసం పాకిస్థాన్ తన దేశీయుల్ని భారత్‌లోకి పంపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ పట్టుబడితే వారిని తమ దేశీయుడని అంగీకరించడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. కొందరిని మాత్రమే తమ జాతీయులని అంగీకరిస్తూ.. మిగిలిన వారితో తమకు సంబంధం లేనట్లు చేతులు దులుపుకొంటోంది. ఈ కారణంగానే 2004లో నమోదైన కేసులో 2013లో అరెస్టు అయి, 2015లో ఆ కేసు వీగిపోయినా 76 ఏళ్ల వయసున్న పాకిస్థానీ షేర్ అలీ కేశ్వానీ ఇప్పటికీ చర్లపల్లి కేంద్రం కారాగారంలో మగ్గుతున్నాడు.
ఐఎస్‌ఐ ఆదేశాలతో వచ్చిన అర్షద్...
పాకిస్థాన్‌లోని రహీమైఖర్‌ఖాన్ జిల్లా ఖాన్‌పూర్‌కు చెందిన అర్షద్ మహమూద్ అలియాస్ అర్షద్ మాలిక్‌ను 2002 నవంబరులో పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ అధికారులు ఫీర్జీ, లియాఖత్ సంప్రదించారు. మూడు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి, భారత ఆర్మీ యూనిట్ల సమాచారం అందించడానికి సిద్ధం చేశారు. అర్షద్‌కు పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ పంపారు. అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్లు అర్షద్ పేరుతో బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్‌రామ్‌పూర్ మీదుగా కోల్‌కతా పంపారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని 2003 జూలైలో పాస్‌పోర్ట్ అందుకున్నాడు. దీంతో సిటీకి వచ్చిన అర్షద్ ముత్యాల్‌బాగ్‌లో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారితో తాను వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినంటూ, కోల్‌కతా నుంచి వచ్చినట్లు చెప్పుకొన్నాడు.
2004లో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
నగరంలోని భద్రతా బలగాలకు చెందిన సున్నిత ప్రాంతాల్లో తిరిగి, వివరాలు సేకరించే అర్షద్ మాలిక్ రాత్రి వేళల్లో వాటిని ఐఎస్‌ఐకి పంపేవాడు. కింగ్‌కోఠి అగర్వాల్ చాంబర్స్‌లో ఉండే హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా షేర్ చేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. 2004 మార్చి 9న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ పోలీసులు సైబర్ కేఫ్‌లో ఉన్న అర్షద్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి ఆర్మీ లొకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్‌ల్లో ఉన్న ఆర్మీ లొకేషన్స్ స్కెచ్‌లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు స్వా«దీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసుల ఆ తర్వాత సిట్‌కు బదిలీ అయింది.
ఇతడి విచారణలో వెలుగులోకి ..
అర్షద్ విచారణ నేపథ్యంలోనే ఇతడికి షేర్ అలీ కేశ్వానీ అనే పాకిస్థానీ సహకరించినట్లు వెలుగులోకి వచి్చంది. ఇతడిని ఉగ్ర ఫైనాన్షియర్‌గా మార్చిన పాకిస్థాన్.. భారత్‌కు పంపింది. ఇక్కడ ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు ఆర్థిక సాయం చేస్తున్న కేశ్వానీని ఆగ్రా పోలీసులు 2004 జనవరిలోనే అరెస్టు చేశారు. అక్కడ కేసు విచారణ పూర్తికావడం, జైలు శిక్ష సైతం విధించడంతో సుదీర్ఘకాలం సిటీకి తీసుకురాలేకపోయారు. అర్షద్‌కు నాంపల్లి కోర్టు 2009లో జీవితఖైదు విధించింది. కేశ్వానీని నగర పోలీసులు 2013లో ఇక్కడికి తీసుకువచ్చారు. 2015 మార్చి 9న ఇతడిపై ఉన్న కేసు వీగిపోయింది. ఇలాంటి వాళ్ల శిక్షాకాలం పూర్తయినా, కేసు వీగిపోయినా జైలు నుంచి బయటకు పంపాలంటే పాకిస్థాన్ సదరు వ్యక్తి తమ పౌరుడే అని అంగీకరించాలి. అర్షద్ తమ జాతీయుడేనని అంగీకరించడంతో 2017లో అతడిని పాక్‌కు పంపేశారు. కేశ్వానీ విషయంలో ఇలా జరగకపోవడంతో ఇప్పటికీ చర్లపల్లి జైలులోనే ఉన్నాడు.