
వాహన ఇంజిన్లపై తీవ్ర ప్రభావం
పట్టని పౌరసరఫరాల యంత్రాంగం
నగర శివారు సాగర్ రోడ్డులోని ఓ ప్రధాన చమురు కంపెనీకి చెందిన పెట్రోల్ బంకులో రవీందర్ అనే వాహనదారు లీటర్ పెట్రోల్ పోయించుకున్నాడు. వాహనం కొద్దిదూరం వెళ్లిన తర్వాత మొరాయించింది. బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్లగా పెట్రోల్ ట్యాంక్‌లో నీళ్లు ఉన్నట్లు వెల్లడించారు. కంగుతిన్న సదరు వినియోగదారు కలెక్టర్‌తో పాటు స్థానిక పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
రెండేళ్ల క్రితం హయత్‌నగర్‌లోని బంక్‌లో నీళ్లతో కూడిన పెట్రోలు వచి్చందని వాహనదారులు ఆందోళన చేపట్టారు. ఫిర్యాదు రావడంతో పౌరసరఫరాల అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించి చేతులు దులుపుకొన్నారు. బంక్ యాజమానిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నెల రోజుల క్రితం చైతన్యపురిలోని జాతీయ రహదారిపై ఉన్న బంక్‌లో పెట్రోల్ పోయించుకోగా కొద్ది దూరం వెళ్లిన తర్వాత వాహనాలు మొరాయించాయి. అనుమానంతో వినియోదారులు ఖాళీ బాటిల్ తీసుకెళ్లి పెట్రోల్ పోయించారు. బాటిల్ అడుగున నీరు ఉండటంతో ఆందోళనకు దిగారు.
నగర పరిధిలోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు నీళ్లు కూడా వస్తున్నాయి. పెట్రోల్ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా తయారైంది. ఇప్పటికే పెట్రోల్ బంకుల కాసుల కక్కుర్తి నాణ్యతలో కల్తీ, తక్కువ కొలతలతో వాహనదారులు నష్టపోతుండగా... తాజాగా పెట్రోల్‌లో కలుస్తున్న నీళ్లు వాహనాల ఇంజిన్లను దెబ్బతీస్తున్నాయి. బంకుల యాజమానులకు కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ పోయాలన్న ధ్యాసే లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంకుల్లోని ఇంధన నాణ్యతను పరిశీలించాల్సిన పౌరసరఫరా అధికారగణం పట్టించుకోకపోవడంతో పంపింగ్‌పై పెట్రోల్ డీలర్ల నిర్లక్ష్యం మరింత పెరిగినట్లయింది.
ఇథనాల్‌లో పెట్రోల్ మిళితం..
ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రో ల్ సరఫరా నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి. వాస్తవంగా ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీటిచుక్క కలిసినా.. క్రమంగా పెట్రోల్ మొత్తం నీరుగా మారుతోంది. ప్రధాన చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్లో 10 శాతం ఇథనాలన్ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్‌లు స్పష్టం చేస్తున్నా యి. ఇంధనంలో ఇథనాల్‌ను కలపడం వల్ల పెట్రోల్‌లోని ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. అయితే.. ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. కానీ చమురు సంస్థలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు 10 శాతం ఇథనాల్ కలిపి సరఫరా చేస్తూ పూర్తి ధరను కోట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
దెబ్బతీస్తున్న వర్షాకాలం..
పెట్రోల్ బంకుల్లో ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ నిల్వలపై వర్షాకాలం తీవ్రంగా దెబ్బతీస్తోంది. ట్యాంకుల నిర్వహణలో నిర్లక్ష్యంతో కొద్దిపాటి వర్షపు నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారడం సర్వసాధరాణంగా తయారైంది. రోజువారీ స్టాక్ సరఫరా ఆలస్యమైతే బంకుల నిర్వాహకులు అడుగు నిల్వలను సైతం వాహనాలకు పోస్తుండటంతో పెట్రోల్‌తో పాటు నీరు కూడా పంపింగ్ అవుతోంది. వాహనాం స్టార్ట్ అయినా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆగిపోతోంది. నీళ్లు కలిసి పెట్రోల్‌తో ఇంజిన్‌పై ప్రభావం పడుతోంది. బోరు పిస్టల్ పనికి రాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
శాంపిల్స్ సేకరణ అంతంతే
పెట్రోల్ బంకుల్లో శాంపిల్స్ సేకరణ, వాటి పరీక్షలు నామమాత్రంగా మారాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు ఏడాదికోసారి కూడా పెట్రోల్ బంకులను సందర్ళించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవంగా సంబంధిత అధికారులు సాధారణ విధుల్లో భాగంగా పెట్రోల్ బంకుల నుంచి సందర్శించి కల్తీ కట్టడి కోసం శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపి పరీక్షించాల్సి ఉంటుంది. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అవీ అందుబాటులో లేకుండా పోయాయి. పెట్రోల్, డీజిల్‌లో నాణ్యతను పరీక్షించేందుకు అధికారికంగా రెడ్‌హిల్స్‌లో ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్ ఉంది. అక్కడికి శాంపిల్స్‌ను పరీక్షకు పంపించిన దాఖలాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. వినియోగదారులు మాత్రం నీళ్ల పెట్రోల్‌తో నష్టపోతున్నారు.