తండ్రీకొడుకును బలిగొన్న ఐరన్‌ కూలర్‌ | Nirmal District Cooler Incident | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకును బలిగొన్న ఐరన్‌ కూలర్‌

Jun 2 2026 6:11 AM | Updated on Jun 2 2026 6:11 AM

Nirmal District Cooler Incident

నీళ్లు పోస్తుండగా విద్యుత్‌ షాక్‌

పెంబి: ఓ ఐరన్‌ కూలర్‌.. తండ్రీ కొడుకును బలి తీసుకుంది. కూలర్‌లో నీళ్లు పోసేందుకు వెళ్లిన భార్యకు షాక్‌ రావడంతో కేకలు వేసింది. వెంటనే భర్త వెళ్లి కాపాడే క్రమంలో ఆయనకూ షాక్‌ తగిలింది. ఇద్దరి అరుపులు విన్న వారి కొడుకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయగా, ఆయనకూ షాక్‌కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా పెంబి మండలం కోరకంటి తండాలో జరిగింది.

ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. కోరకంటి తండాకు చెందిన రాథోడ్‌ సోనాబాయి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఐరన్‌ కూలర్‌లో నీళ్లు పోస్తూ విద్యుత్‌ షాక్‌కు గురై కేకలు వేసింది. అది విన్న భర్త రాథోడ్‌ అర్జున్‌ (56) ఆమెను కాపాడే ప్రయత్నంలో షాక్‌కు గురయ్యాడు. ఇద్దరి కేకలు విన్న పెద్ద కొడుకు రాథోడ్‌ శ్రీనివాస్‌ (28) తల్లీతండ్రిని రక్షించాలని వెళ్లాడు. అతడు కూడా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. 

చిన్నకొడుకు రాథోడ్‌ సుభాశ్‌ వచ్చి కూలర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. స్థానికులు వచ్చి ముగ్గురిని నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అర్జున్, శ్రీనివాస్‌ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సోనాబాయికి తీవ్ర గాయాలయ్యాయి. రాథోడ్‌ సోనాబాయి–అర్జున్‌ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య, నాలుగేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిమిషాల వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో కుటుంబం దు:ఖసాగరంలో మునిగిపోయింది. సోమవారం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement