ఫౌండేషన్‌కు విరాళమివ్వడమూ నేరమేనా?

Nimmagadda Prasad Has Donated Rs 7 Crore To YSR Foundation - Sakshi

హైకోర్టులో నిమ్మగడ్డ తరఫు న్యాయవాది వాదనలు

సాక్షి, హైదరాబాద్‌: నిరుపేదల వైద్య చికిత్సలకు ఆర్థికసాయం అందించే వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ రూ.7 కోట్లు విరాళం ఇచ్చారని, దీన్ని కూడా సీబీఐ నేరంగా చూస్తోందని ఆయన తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వైఎస్‌ జగన్‌ కంపె నీల్లో పెట్టుబడులకు సంబంధించి తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ ప్రసాద్‌ వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సోమవారం మరోసారి విచారించారు.

నిమ్మగడ్డ ఫౌండేషన్‌ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దాదాపు రూ.130 కోట్లు సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారని నిరంజన్‌రెడ్డి నివేదించారు. సండూర్‌ పవర్, భారతీ సిమెంట్స్‌లో నిమ్మగడ్డ పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చాయని, అయితే పెట్టుబడులు పెట్టినట్లుగా మాత్రమే చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొందని, వచ్చిన లాభాలను ప్రస్తావించడం లేదని తెలిపారు.

రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ పేర్కొనడం నిరాధారమని, పెట్టుబడులకు వచ్చిన లాభాలను కూడా కలిపి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా చూపిస్తోందని అన్నారు. సీబీఐ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top