శని, ఆదివారాల్లో క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్-2026
దేశం నలుమూలల నుంచి 400 మంది రుమటాలజిస్టుల హాజరు
రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే సదస్సు
ప్రపంచంలోనే మొట్టమొదటి "కేసు ఆధారిత" సదస్సు
హైదరాబాద్, సాక్షి : ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు తదితర రుమటాలజీ సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రకాల చికిత్సా పద్ధతులు వస్తున్నాయని, వీటి గురించి రుమటాలజిస్టులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోగులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించడం ముదావహమని కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 (సీఆర్‌సీ 2026) సదస్సును ఆయన ప్రారంభించారు.
దేశం నలుమూలల నుంచి 400 మందికి పైగా రుమటాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ సదస్సులోఅనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అత్యంత సంక్లిష్టమైన కేసులకు ఎలా చికిత్స చేశారన్న విషయాన్ని కేసుల వారీగా చర్చించిన తరువాత, తద్వారా సదస్సులో పాల్గొన్న అందరికీ ఈ తరహా కేసులకు ఎలా చికిత్స చేయాలన్న విషయాలను వివరించారు.
సదస్సు ప్రారంభోత్సవంలో కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, డా. బి. శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డా. వినోద్ రవీంద్రన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి, హైదరాబాద్ రుమటాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, సీఆర్‌సీ 2026 సైంటిఫిక్ ఛైర్ డాక్టర్ వినోద్ రవీంద్రన్, నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, వాస్కులైటిస్, బాల్య ఆర్థరైటిస్, అరుదైన రుమాటిక్ కండిషన్ల వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో ట్రైనీల కోసం రుమటాలజీ క్విజ్ కూడా నిర్వహించారు.
సీఆర్‌సీ 2026 ప్రత్యేకతలలో ఒకటి కొత్తగా చేర్చిన ఇమేజ్ పోటీ. సదస్సులో పాల్గొన్న పలువురు ఈ అంశంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సదస్సుకు తమ సృజనాత్మక కోణాన్ని జోడించారు. అదనంగా, భారతదేశం నలుమూలల నుండి 269 కేసు సారాంశాలను సమర్పించారు. ప్రతి కేటగిరీలో ఎంపిక చేసిన ముఖ్యమైన కేసులను కాన్ఫరెన్స్ సెషన్లలో చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “సీఆర్‌సీ 2026 విజయవంతం కావడం, దేశవ్యాప్తంగా ఉన్న రుమటాలజిస్టులు ఉత్సాహభరితంగా భాగస్వామ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ సదస్సులో హాజరైన అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అందరూ తమ తమ విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడం, అత్యంత సమస్యాత్మకమైన కేసుల గురించి చర్చించడానికి ఈ సదస్సు ఒక విలువైన అవకాశాన్ని కల్పించింది. ఇందులో ప్రధానంగా రుమాటిక్, కండరాలు, లూపస్ వ్యాధులపై అవగాహన పొందగలిగాము” అన్నారు.
భారతదేశంలో రుమటాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 ఒక ప్రముఖ వేదికగా తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. రుమటాలజీలో విజ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన అభివృద్ధి సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న సీఆర్‌సీ తదుపరి ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.


