
ముంపు సమస్యలపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ సీఎస్‌లతో చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈనెల 28న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని సమీక్షించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్(బహిరంగ విచారణ) నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227.84 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393.89 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకూ 60.78 శాతం పూర్తయ్యాయి.
రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయాలంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. బ్యాక్ వాటర్ ప్రభావంపై నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించి.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు.