
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావు.. ఏసీబీ కస్టడీలో పలు కీలక వివరాలు వెల్లడించారు. చాలావరకు ఆస్తులు తన కుమారుడి సంపాదనతోనే కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమార్జనపైనే ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీశారు. కోర్టు అనుమతితో ఈనెల 23 నుంచి ఏసీబీ అధికారులు మురళీధర్‌రావును కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆదివారంతో ఆయన కస్టడీ ముగిసింది. కాగా, ఈనెల 15న ఏసీబీ అధికారులు మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం తెలిసిందే. ఏకకాలంలో హైదరాబాద్‌లోని మురళీధర్ రావు ఇంటితో పాటు.. కరీంనగర్, జహీరాబాద్ సహా మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. స్థిర, చరాస్తులతో పాటు పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన కీలకపత్రాలను ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.
వీటితో పాటు బినామీల పేరుతో ఉన్న ఆస్తులను గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో మురళీధర్ రావు ఆస్తులపైనే ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. మొదట ఏసీబీ అధికారులకు సహకరించకపోయినా.. వరుసగా ఆస్తుల పత్రాలు, ఇతర కీలక పత్రాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఐదు రోజుల విచారణలో భాగంగా సేకరించిన సమాచారం ఆధారంగా.. కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.