పదోసారి పోటీ.. మునుగోడులో విజయం నాదే : మారం వెంకట్‌రెడ్డి

Munugode Bypoll Independent Candidate Maram Venkat Reddy Nomination - Sakshi

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో మొదటి రోజు నామినేషన్‌ వేసిన అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మారం వెంకట్‌రెడ్డి 1996 నుంచి ఇప్పటికి 9 సార్లు చట్టసభలకు పోటీ చేశారు. మునుగోడులో పోటీతో పదవది అవుతుంది. 1999, 2004లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి,  2009, 2014, 2018లో సూర్యాపేట శాసనసభ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 1996లో మిర్యాలగూడ పార్లమెంట్‌ స్థానానికి, 2019లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేశారు. నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో తనకు 10వేల పైచిలుకు ఓట్లు వచ్చినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు.

 హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేశానని, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విత్‌డ్రా అయ్యానని తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోటీచేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడంతో తాను 10వసారి ఎన్నికల్లో పోటీ చేసినట్లవుతుందన్నారు. మునుగోడులో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి తాను ఆ పార్టీలో పనిచేశానని, 2004 వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో చురుగ్గా పనిచేశానని, అప్పటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో పార్టీని వదిలానని వెంకట్‌రెడ్డి వివరించారు. ఆర్‌ఎంపీగా జీవనం గడుపుతున్నట్టు చెప్పారు. నామినేషన్‌కు, ఎన్నికల ప్రచారానికి ఖర్చవుతుంది కదా అని ప్రశ్నించగా.. ప్రజా సేవకోసం తానేమీ బాధ పడటం లేదని.. ప్రజలెప్పుడో ఒకసారి తనను అర్థం చేసుకుంటారని.. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకే పోటీ చేస్తున్నానని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top