‘కేసీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి’ | MP Kadiyam Kavya Hits Back at KCR Over Recent Comments | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి’

Apr 28 2026 12:24 AM | Updated on Apr 28 2026 12:40 AM

MP Kadiyam Kavya Hits Back at KCR Over Recent Comments

హనుమకొండ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు.

తెలంగాణ విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తాను పార్లమెంట్‌లోనే ఖండించినట్లు కడియం కావ్య గుర్తుచేశారు. ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా అవి అనుచిత వ్యాఖ్యలని నిలదీశానని తెలిపారు. అలాగే పార్లమెంట్ నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పారు.

ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ముక్తకంఠంతో ఖండించడంతో పాటు కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి చేరలేదని, లేదా ఆయన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోలేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కేసీఆర్‌కు కావ్య సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధికి సంబంధించి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఇవ్వాలని కోరుతూ, ప్రజా సమస్యలపై చర్చలు జరపడం ద్వారా రాష్ట్రానికి మేలు చేకూరుతుందని కడియం కావ్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement